తిరుమలలో కొత్త స్కాం... నకిలీ ఆధార్ కార్డులతో గదులు...అధిక ధరలకు విక్రయం.. దళారుల ముఠా అరెస్ట్..

తిరుమలలో కొత్త స్కాం... నకిలీ ఆధార్ కార్డులతో గదులు...అధిక ధరలకు విక్రయం.. దళారుల ముఠా అరెస్ట్..

తిరుమలలో కొత్త స్కాం వెలుగులోకి వచ్చింది.. నకిలీ ఆధార్ కార్డులతో గదులు పొంది అధిక ధరలకు విక్రయిస్తున్న దళారుల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆరుగురు దళారులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు, సెల్‌ఫోన్లు స్వాధీనం.

భక్తులకు కేటాయించే గదులను నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో అక్రమంగా పొందుతూ, వాటిని టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు అమ్ముతున్నారు దళారులు.

ఈ క్రమంలో ఆగస్టు 08న ఉదయం తిరుమల CRO కార్యాలయం దగ్గర అనుమానాస్పదంగా గదులు పొందేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు వ్యక్తులను సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ ఆధార్ కార్డులను తయారు చేసి, వాటిలో ఫొటోలను మార్ఫింగ్ చేసి, వాటి ద్వారా టీటీడీ CROలో గదులు పొందుతున్నట్లు వెల్లడైంది.

►ALSO READ | కూటమి ప్రభుత్వం హెరిటేజ్, ప్రైవేట్ డెయిరీల కోసం... విజయ డెయిరీని బలి తీసుకుంటోంది: సీపీఎం

అనంతరం ఆ గదులను భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తానికి విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అదేవిధంగా, తిరుమలలోని PAC-5 వద్ద భక్తులు ఛార్జింగ్‌కు ఉంచిన సెల్‌ఫోన్లను దొంగతనం చేసినట్లు కూడా విచారణలో వెల్లడైంది.

ఈ ఘటనకు సంబంధించి బి. శ్రీనివాస్ (46), ఇరప్ప కాలప్ప (43), విష్ణు వర్ధన్ (33), అమూల్ కుమార్ సింగ్ (27), ఎస్. ప్రకాష్ (39), పి. సందీప్ (20) అనే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి గది బుకింగ్‌లు, నకిలీ గుర్తింపు పత్రాల కోసం ఉపయోగించిన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు . ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

తిరుమలలో గదులను టీటీడీ అధికారిక కౌంటర్లు మరియు అధికారిక ఆన్‌లైన్ విధానాల ద్వారా మాత్రమే పొందాలని పోలీసులు సూచించారు. రూమ్ దళారీలను నమ్మి టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి మోసపోవద్దని తెలిపారు.