ఐవరీ కోస్ట్ సరికొత్త చరిత్ర.. తొలిసారి వరల్డ్ కప్ నాకౌట్కు అర్హత..

ఐవరీ కోస్ట్ సరికొత్త చరిత్ర.. తొలిసారి వరల్డ్ కప్ నాకౌట్కు అర్హత..

ఫిలడెల్ఫియా: ఫిఫా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఐవరీ కోస్ట్‌‌‌‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. శుక్రవారం జరిగిన గ్రూప్‌‌‌‌–ఇ లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో 2–0తో కురసావోపై గెలిచింది. ఫలితంగా తమ జాతీయ జట్టు చరిత్రలో తొలిసారి నాకౌట్‌‌‌‌ రౌండ్‌‌‌‌కు అర్హత సాధించింది. నికోలస్‌‌‌‌ పేపే (7, 64వ ని) డబుల్‌‌‌‌ గోల్స్‌‌‌‌తో ఐవరీ కోస్ట్‌‌‌‌కు అద్భుత విజయాన్ని అందించాడు.

మ్యాచ్‌‌‌‌ ప్రారంభంలోనే పట్టు బిగించిన ఐవరీ కోస్ట్‌‌‌‌ ప్లేయర్లు కురసావోపై పూర్తి ఆధిపత్యం చూపెట్టారు. 7వ నిమిషంలో 19 ఏళ్ల యాన్‌‌‌‌ డియోమాండే అందించిన పాస్‌‌‌‌ను పేపే సూపర్‌‌‌‌గా గోల్‌‌‌‌ పోస్ట్‌‌‌‌లోకి పంపాడు. ఇక్కడి నుంచి కురసావో ఎదురుదాడులకు దిగింది. కానీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది.

సెకండాఫ్‌‌‌‌లో మరింత ఉత్సాహంతో ఆడిన పేపే వరుస దాడులతో కురసావో గోల్‌‌‌‌ కీపర్‌‌‌‌ను బెంబేలెత్తించాడు. గోల్‌‌‌‌ కీపర్‌‌‌‌ కొన్ని ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసినా పెద్దగా లాభం చేకూరలేదు. 64వ నిమిషంలో పేపే ఎడమ కాలితో కొట్టిన బుల్లెట్‌‌‌‌ షాట్‌‌‌‌ నేరుగా గోల్‌‌‌‌ పోస్ట్‌‌‌‌లోకి దూసుకెళ్లడంతో ఐవరీ కోస్ట్‌‌‌‌ విజయానందంలో మునిగిపోయింది.