ఈ యేడు కాలం వెన్కకే..! సీజన్ షురూ అయినా వర్షాలు లేక సాగని ఏరువాక

ఈ యేడు కాలం వెన్కకే..! సీజన్ షురూ అయినా వర్షాలు లేక సాగని ఏరువాక
  • పలుచోట్ల వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తక మురిగిపోతున్నయ్..
  • చినుకపడితే పంటలు దక్కుతాయనే ఆశలో రైతాంగం
  • గతేడాదితో పోలిస్తే సగానికి పడిపోయిన సాగు విస్తీర్ణం
  • ఇప్పటివరకు 14.78 లక్షల ఎకరాల్లోనే సాగు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: వానాకాలం సీజన్ ప్రారంభమై దాదాపు నెల కావస్తున్నా రాష్ట్రవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. దీంతో వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. తొలి జల్లులు పడగానే రైతులు పత్తి విత్తనాలు విత్తినప్పటికీ, ఆ తర్వాత వానలు ముఖం చాటేయడంతో అవి మొలకెత్తకుండా నేలలోనే మాడిపోతున్నాయి.

రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎండల తీవ్రతకు మొదటిసారి వేసిన విత్తనాలు ఎండిపోవడంతో రైతులు అప్పులు చేసి మరీ రెండోసారి కొనుగోలు చేసి విత్తుతున్నారు. వానలు పడతాయనే నమ్మకం తప్ప తమకు మరో దారి కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సగానికి పడిపోయిన సాగు విస్తీర్ణం..
ఈ ఏడాది వానాకాలం సాగుపై వర్షం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్రవ్యాప్తంగా 134 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం 14.78 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి.

గతేడాది ఇదే సమయానికి 28.38 లక్షల ఎకరాల్లో సాగు జరగగా, ఈసారి ఆ విస్తీర్ణం సగానికి పడిపోయింది. సాధారణంగా వానాకాలంలో నిత్యం సందడిగా ఉండే గ్రామాలు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. దుక్కులు దున్ని విత్తనాలు వేయాల్సిన పొలాలు ఇంకా బీడుగానే దర్శనమిస్తున్నాయి.

ఆందోళనకరంగా పత్తి పరిస్థితి..
రాష్ట్రంలో ప్రధాన వర్షాధార పంట అయిన పత్తి పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 12.60 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసినప్పటికీ, అందులో సగానికి పైగా విస్తీర్ణంలో మొలకలు రాలేదు.

జూన్ తొలి వారంలో పడిన చిరు జల్లులను నమ్ముకుని రైతులు తొందరపడినా.. ఆ తర్వాత వర్షాలు లేకపోవడంతో నేలలో తేమ పూర్తిగా తగ్గిపోయింది. పత్తి ఎక్కువగా సాగయ్యే ఆదిలాబాద్, మహబూబ్​నగర్​, వరంగల్​, నిజామాబాద్ తదితర జిల్లాల్లో మొదటి విడత వేసిన విత్తనాలు వృథా కావడంతో రైతులు మళ్లీ పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది.

పుంజుకోని వరి నాట్లు..
సాధారణంగా జూన్ రెండో వారంలో అనేక ప్రాంతాల్లో వరి నాట్లు మొదలవుతాయి. కానీ ఈసారి వర్షాలు లేకపోవడం, చెరువులు, కుంటలు, బోర్లలో నీరు లేకపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి దాదాపు 80 వేల ఎకరాల్లో వరి సాగు అవ్వగా, ఈసారి కేవలం 48 వేల ఎకరాలకే పరిమితమైందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

ఆందోళనలో రైతులు..
ఒకవైపు వర్షాలు లేక సాగు ఆలస్యమవుతుండగా.. మరోవైపు ఇప్పటికే వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడం రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిస్తేనే పత్తితోపాటు ఇతర పంటలు గాడినపడే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇతర పంటలదీ అదే బాట..
వానాకాలంలో సోయాబీన్ సాగు గణనీయంగా తగ్గింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో ఎక్కువగా సాగయ్యే ఈ పంట పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గతేడాది ఇదే సమయానికి 1.43 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగవగా, ఈసారి కేవలం 25 వేల ఎకరాలకే పరిమితమైంది. 

మరోవైపు వర్షాధార పంటలైన మొక్కజొన్న, కంది సాగు కూడా తీవ్రంగా దెబ్బతింది. నిరుడు ఇదే సమయానికి లక్ష ఎకరాల్లో మొక్కజొన్న సాగవగా, ఇప్పుడు కేవలం 30 వేల ఎకరాల్లోనే నమోదైంది. కంది పంట నిరుడు 1.28 లక్షల ఎకరాల్లో సాగవగా.. ఈసారి కేవలం 55 వేల ఎకరాలకే పరిమితం కావడం గమనార్హం.