- మహిళలను లక్షాధికారులను చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్
పరిగి, వెలుగు: కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దొంగ ఓట్లను నమ్ముకుని ఎన్నికల్లో పోటీ చేస్తాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బెంగాల్లో 95 లక్షల ఓట్లు తొలగించారని.. గల్లంతైన తమ ఓట్ల కోసం ఓటర్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 1.67 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్విసరారు. శుక్రవారం పరిగిలో జరిగిన సర్ అవగాహన కార్యక్రమానికి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్దండపూర్ నుంచి బీఆర్ఎస్ హయాంలో కాలువ తవ్వితే గ్రావిటీ ద్వారా పరిగి, కోడంగల్ నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందన్నారు. కమీషన్లు, కుటుంబ సంపాదన కోసం రూ.4400 కోట్లు పెట్టి సీఎం లిఫ్ట్ పెట్టారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్రూ.12 వేల కోట్లు చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని వివరించారు.
ఇచ్చిన 420 హామీలు నెరవేర్చట్లేదు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు 420 హామీలు ఇచ్చిందని.. ఇప్పుడు వాటిని నెరవేర్చడంలో విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. అసైన్డ్‌భూములకు పట్టాలిస్తామని చెప్పి.. ఇప్పుడు పేదల భూములను ఇండస్ట్రియల్ పేరుతో గుంజుకుంటున్నారని తెలిపారు. ఎన్నికలెప్పడు వచ్చినా గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. సర్ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సబితా ఇంద్రారెడ్డి, మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
