- ట్రస్ట్ జనరల్ సెక్రటరీతోపాటు ట్రస్టీ అనిల్ మిశ్రా రిజైన్
- విరాళాల చోరీ కేసులో 8 మంది అరెస్ట్
- రూ.7.5 కోట్ల నిధుల గోల్‌మాల్.. రంగంలోకి దిగిన సిట్
అయోధ్య: ప్రసిద్ధ అయోధ్య రామ్‌మందిర్ క్షేత్రంలో భక్తులు సమర్పించిన విరాళాల సొమ్ము పక్కదారి పట్టిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. లెక్కింపులో దాదాపు రూ. 7 నుంచి 7.5 కోట్ల మేర అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో.. నైతిక బాధ్యత వహిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక విచారణ బృందం (సిట్) ప్రాథమిక నివేదికను సమర్పించిన వెంటనే ఈ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు ఈ భారీ కుంభకోణానికి సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ట్రస్ట్ సభ్యుడు కృష్ణ మోహన్ ఇచ్చిన ఫిర్యాదుతో తొలి ఎఫ్‌ఐఆర్ నమోదైన కొద్ది గంటల్లోనే ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో అవినాశ్ శుక్లా, అనుకల్ప్ మిశ్రాతో పాటు నగదు లెక్కింపు బాధ్యతలు చూసే ఆరుగురు ఆలయ సిబ్బంది ఉన్నారు. నిందితులు విరాళాల సొమ్మును నొక్కుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. వీరిపై దొంగతనం, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఎఫ్‌ఐఆర్‌లో ట్రస్ట్ సీనియర్ నిర్వాహకుల బాధ్యతను ఎక్కడా నిర్ధారించలేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ ప్రభుత్వంలో కేవలం చిన్న చేపలకే శిక్ష పడుతుందని, పెద్ద చేపలను వదిలేస్తారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. అయోధ్య రామాలయ విరాళాల చోరీపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని, ప్రస్తుత రామ్ మందిర ట్రస్ట్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
