- గ్రామం యూనిట్‌గా అభివృద్ధికి ‘జీపీ బుక్‌లెట్’
- పనుల పురోగతిపై నిరంతర నిఘా..
- ఉత్తర్వులు జారీ చేసిన స్పెషల్ సీఎస్ దాన కిశోర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కొత్త వ్యవస్థను తీసుకొస్తోంది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు శాఖలో ప్రత్యేక డ్యాష్‌బోర్డు, ప్రోగ్రామ్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం. దాన కిషోర్ జారీ చేశారు. కొత్త డ్యాష్‌బోర్డు ద్వారా రాష్ట్రం నుంచి గ్రామ పంచాయతీ స్థాయి వరకు అన్ని అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు ఒకేచోట చూసే అవకాశం ఉంటుంది.
ఏ పని ఎక్కడ ఆగిపోయింది, ఎందుకు ఆలస్యం అవుతోంది అనే విషయాలను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోనున్నారు. పీఎంయూలో ఐటీ, డేటా నిపుణుల బృందం పనిచేస్తుంది. వీరు ప్రతిరోజూ పథకాల అమలుపై సమీక్ష చేసి అధికారులకు నివేదికలు అందిస్తారు. అలాగే ప్రతి గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ సేవలు, మౌలిక వసతుల వివరాలన్నీ ఒకేచోట ఉండేలా గ్రామ పంచాయతీ బుక్‌లెట్ రూపొందించనున్నారు.
గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ బుక్‌లెట్ తయారీ కోసం ఫార్మాట్ ప్రిపరేషన్, ట్రైనింగ్, ఐటీ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటి పనిని సీనియర్ అధికారులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీ పర్యవేక్షించనుంది. గ్రామసభల్లో ప్రజలు చెప్పిన సమస్యలను త్వరగా పరిష్కరించడం, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం, పాలనలో పారదర్శకత పెంచడమే ఈ కొత్త విధానం లక్ష్యమని అధికారులు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో బుక్‌లెట్ ముసాయిదాను సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపాలని దాన కిషోర్ ఆదేశించారు
