ఆపరేషన్ సిందూర్‌‌‌‌‌‌‌‌లో అమరులైంది ఆరుగురు..అధికారికంగా ఆరుగురు సోల్జర్ల పేర్లు ప్రకటించిన కేంద్రం

ఆపరేషన్ సిందూర్‌‌‌‌‌‌‌‌లో అమరులైంది  ఆరుగురు..అధికారికంగా ఆరుగురు సోల్జర్ల పేర్లు ప్రకటించిన కేంద్రం
  • నేషనల్ వార్ మెమోరియల్‌‌లో చోటు కల్పించి గౌరవం 

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌‌లో వీరమరణం పొందిన ఆరుగురు సైనికుల పేర్లను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. దేశ సేవలో తమ ప్రాణాలను అర్పించిన వేలాది మంది సైనికుల పేర్లతో పాటు ఈ ఆరుగురి పేర్లను నేషనల్ వార్ మెమోరియల్ వెబ్‌‌సైట్‌‌లోని 'రోల్ ఆఫ్ ఆనర్'లో చేర్చింది. అలాగే, న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్న ‘వాల్ 3డి'పై కూడా చెక్కించనుంది. 

జమ్మూ కాశ్మీర్‌‌లోని పహల్గామ్‌‌లో గత ఏడాది ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారతదేశం సైనిక చర్యకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్​లో వీరమరణం పొందిన ఆరుగురు భారత సాయుధ దళాల సిబ్బంది గుర్తింపును ప్రభుత్వం తొలిసారి బహిరంగంగా వెల్లడించింది. 

ఇందులో భారత ఆర్మీకి చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్‌‌మ్యాన్ సునీల్ కుమార్, లాన్స్ నాయక్ దినేష్ కుమార్, ఏవియేషన్ టెక్నీషియన్ మూడ్ మురళీనాయక్, హవల్దార్ సునీల్ కుమార్ సింగ్, ఎయిర్​ఫోర్స్​కు చెందిన సార్జెంట్ సురేంద్ర కుమార్ వీరమరణం పొందినట్టు కేంద్రం తెలిపింది.

 మే 2025లో నాలుగు రోజుల పాటు జరిగిన ఆపరేషన్​లో సైనిక ప్రాణనష్టం జరిగినట్టు నివేదికలు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఇప్పటివరకు వారి గుర్తింపును అధికారికంగా వెల్లడించలేదు. జమ్మూ కాశ్మీర్‌‌లోని పహల్గామ్‌‌లో గత ఏడాది ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 25 మంది పర్యాటకులు, ఒక  స్థానికుడు మరణించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం మే 7న ఆపరేషన్ సిందూర్‌‌ను ప్రారంభించింది. 

పాకిస్తాన్, పీవోకేలోని టెర్రర్ స్థావరాలపై పై విరుచుకుపడింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్‌‌తో సహా పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన కీలక స్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత మే 10న సైనిక చర్యలను నిలిపివేసేందుకు భారత్, పాకిస్తాన్‌‌ ఒక అవగాహనను ప్రకటించాయి.