- సిపెక్ సర్వేలో విస్తుపోయే నిజాలు.. గందరగోళంలో ఆఫీసర్లు
- స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం
- గతేడాది నిధులు రూ.87 కోట్లలో ఖర్చు చేసింది రూ.40 కోట్లే..
- తాజాగా మరుగుదొడ్లు, కమ్యూనిటీ టాయిలెట్స్, సోక్ పిట్స్ కోసం రూ. 160 కోట్లు
- ఈ సారి 2.19 లక్షల మరుగుదొడ్లు కట్టాలని టార్గెట్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ‘స్వచ్ఛ భారత్’ మిషన్ (గ్రామీణ) లక్ష్యం మరుగునపడుతోంది. పల్లెలన్నీ బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్ ప్లస్) గ్రామాలుగా మార్చాలన్న సంకల్పం క్షేత్రస్థాయిలో నీరుగారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గతంలో నిర్వహించిన సిపెక్ (సామాజిక-ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల) సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ఇంకా 12,89,289 కుటుంబాలకు మరుగుదొడ్డి సౌకర్యం లేదని తేలింది. ఇందులో 3.11 లక్షల ఎస్సీ, 3.45 లక్షల ఎస్టీ కుటుంబాలు ఉండటం గమనార్హం. ప్రధానంగా ఆదిలాబాద్, వికారాబాద్, నల్గొండ, ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉన్నట్టు సర్వే స్పష్టం చేస్తోంది.
సర్వే రిపోర్టుతో ఆఫీసర్ల హైరానా
రాష్ట్రంలో ఇంటింటికీ మరుగుదొడ్లు ఉన్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆఫీసర్లు ఇన్నాళ్లూ చెబుతూ వచ్చారు. పంచాయతీరాజ్ శాఖ రికార్డుల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 52 లక్షల కుటుంబాలు ఉంటే.. సిపెక్ సర్వేలో 62 లక్షల కుటుంబాలు ఉన్నట్టు తేలింది. ఈ 10 లక్షల తేడానే ఇప్పుడు ఆఫీసర్లను గందరగోళానికి గురి చేస్తోంది. గతంలో మరుగుదొడ్ల బిల్లులు తీసుకుని నిర్మించుకోకపోవడం, లేదంటే కుటుంబాల నుంచి వేరు పడినవారు కొత్తగా మరుగుదొడ్ల కోసం దరఖాస్తు చేసుకోవడం వల్ల ఈ సంఖ్య పెరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
12 లక్షల ఇండ్లలో మరుగుదొడ్లు లేవంటే నమ్మలేకపోతున్న ఆఫీసర్లు.. ప్రస్తుతం సర్వే డాటా ఆధారంగా క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేపట్టారు. 2026–-27 సంవత్సరంలో 2.19 లక్షల మరుగుదొడ్లు కట్టాలని టార్గెట్పెట్టుకోగా, ఇప్పటివరకు 7,162 (3.26 శాతం) మాత్రమే పూర్తయ్యాయి. దీనిపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో మంత్రి సీతక్క సీరియస్ అయినట్టు తెలిసింది. మూడు నెలల్లో లక్ష్యం చేరుకోవాలని ఆదేశించినట్టు సమాచారం.
నిధులున్నా.. నిర్లక్ష్యమే !
నిధులు ఉన్నప్పటికీ గత సర్కార్ నిర్లక్ష్యం, ప్రణాళికాలోపం కారణంగా స్వచ్ఛభారత్లక్ష్యం నీరుగారిందని అధికారులు అంటున్నారు. బీఆర్ఎస్కు, కేంద్రానికి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో మరుగుదొడ్ల నిర్మాణంపై ఫోకస్పెట్టలేదని చెప్తున్నారు. స్వచ్ఛభారత్పథకంలో భాగంగా కేంద్రం ఇచ్చే 60 శాతం నిధులకు రాష్ట్రం తన వాటా 40 శాతాన్ని కలిపి లబ్ధిదారులకు చెల్లించాలి.
కానీ కేంద్రం నిధులు ఇచ్చినా... అప్పటి బీఆర్ ఎస్ సర్కార్ తన వాటా చెల్లించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025-–26 లో రూ.83.33 కోట్లు కేటాయించింది. ఈ నిధులు డిసెంబర్, జనవరి మాసంలో కేటాయించడంతో రూ.47.67 కోట్లు (57.20 శాతం) మాత్రమే ఖర్చు చేసినట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. 2026-–27లో పారిశుధ్య పనులతో పాటు కమ్యూనిటీ టాయిలెట్లు, సెగ్రిగేషన్షెడ్లు, ఇంకుడు గుంతలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ల కోసం జిల్లాలకు రూ.160 కోట్లు కేటాయించగా.. ఇప్పటివరకు రూ.12.14 కోట్లు (7.6 శాతం) మాత్రమే ఖర్చు చేశారు. మార్చి నాటికి నిధులు ఖర్చు చేస్తే మళ్లీ నిధులు మంజూరు కానున్నాయి.
మూడు నెలల్లో టార్గెట్ సాధించేలా..
రాష్ట్రంలోని 15 జిల్లాల్లో కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. 2026- 27 లక్ష్యం 7,345 యూనిట్లు కాగా.. 0.5 శాతం అంటే 37 మాత్రమే పూర్తయ్యాయి. చెత్త సేకరణ కోసం 219 సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించాల్సి ఉండగా.. ఒక్కటి మాత్రమే కట్టారు. భూ సేకరణ, టెండర్ల సమస్యలతో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు పెండింగ్‌లో ఉన్నాయి. రాబోయే మూడు నెలల్లో టార్గెట్ సాధించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆఫీసర్లు పనుల్లో వేగం పెంచారు.
ఆగస్టులో కేంద్ర తాగునీరు, పారిశుధ్య శాఖ (డీడీడబ్ల్యూఎస్) బృందం రాష్ట్రంలో పర్యటించి పనులను సమీక్షించనుంది. అప్పటికల్లా కనీసం 60 శాతం నిధులు ఖర్చు చేయకపోతే.. భవిష్యత్తులో కేంద్రం నుంచి వచ్చే నిధులకు కోత పడే ప్రమాదం ఉందని ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మరుగుదొడ్డి నిర్మించుకుంటే.. ఇవ్వాల్సిన రూ. 12 వేల చెల్లింపుల్లోనూ జాప్యం జరుగుతోంది. మొత్తం 2.76 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించగా.. అందులో 1.61 లక్షల మంది ఇండ్లు స్లాబ్ లెవల్ దాటిపోయాయి. కానీ, ఇప్పటివరకు 11,823 మందికి మాత్రమే బిల్లులు ఇచ్చారు.
రికార్డుల మ్యాపింగ్‌లో జాప్యం
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల వివరాలను కేంద్ర పోర్టల్‌లో నమోదు చేయడంలోనూ జాప్యం జరుగుతోంది. రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీలుండగా.. ఎస్బీఎం, ఐఎంఐఎస్ పోర్టల్లో కేవలం 8,961 పంచాయతీల వివరాలు మాత్రమే ఉన్నాయి. ఎల్‌జీడీ కోడ్ ల మ్యాపింగ్‌లో ఆలస్యం వల్ల ప్రభుత్వ ప్రగతి రికార్డుల్లో కనిపించడం లేదు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన పంచాయతీలు, కొన్ని గ్రామాల వివరాలను ఎల్‌జీడీ పోర్టల్లో అప్‌డేట్ చేయకపోవడం, సరిగా లింక్ చేయకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఒక గ్రామం వివరాలు ఎల్జీడీలో లేకపోతే.. ఆ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని మరుగుదొడ్లు కట్టినా, ఎన్ని రోడ్లు వేసినా కేంద్ర ప్రభుత్వ రికార్డుల్లో (ఎస్బీఎం– ఐఎంఐఎస్) కనిపించవు. ఫలితంగా ఆ గ్రామానికి రావాల్సిన నిధులు నిలిచిపోతాయని అధికారులు చెబుతున్నారు.
