అప్పులు రాక తిప్పలు...అధిక వడ్డీలతో చిన్న వ్యాపారాలు కుదేలు...

అప్పులు రాక తిప్పలు...అధిక వడ్డీలతో చిన్న వ్యాపారాలు కుదేలు...
  • 18 శాతం సంస్థలకే ఫార్మల్​ క్రెడిట్​
  • రూ.25 లక్షల కోట్లకు చేరిన క్రెడిట్​ గ్యాప్​
  • డెలాయిట్​​ రిపోర్ట్​ వెల్లడి

న్యూఢిల్లీ: డిజిటలైజేషన్​వల్ల క్షణాల్లో లోన్లు జారీ అవుతున్నా, మైక్రో, స్మాల్​, మీడియం ఎంటర్​ప్రైజెస్​లు​( ఎంఎస్ఎమ్ఈ) మాత్రం అప్పులు పుట్టక ఇబ్బందులు పడుతున్నాయి. డెలాయిట్ సంస్థ తాజా నివేదిక ప్రకారం.. భారత ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన ఎంఎస్‌‌‌‌ఎంఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో 14 శాతం కంపెనీలు మాత్రమే బ్యాంకు లోన్లు పొందుతున్నాయి.  లక్షలాది చిన్న వ్యాపార సంస్థలు ఇప్పటికీ అధిక వడ్డీలు వసూలు చేసే అనధికారిక వ్యాపారులపై, సంస్థలపైనే ఆధారపడాల్సి వస్తోంది. వీటికి అవసరమైన రుణాలను అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. 

2025 మార్చి నాటికి దేశంలో ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యాప్ సుమారు రూ. 25 లక్షల కోట్లు ఉంది. ఎంఎస్ఎంఈలు లేదా వ్యక్తులు వ్యాపారం చేయడానికి లోన్లు అడిగినప్పుడు, సరైన పూచీకత్తు లేక రుణాలు మంజూరు కావు. దీంతో క్రెడిట్ గ్యాప్ ఏర్పడుతుంది. దేశ జీడీపీలో ఎంఎస్​ఎంఈ రంగం వాటా 31.1 శాతం ఉంది. ఆరోగ్యకరమైన క్రెడిట్ జీడీపీ నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుంటే ఈ లోటు రూ. 50 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ నిలవాలంటే చిన్న వ్యాపారాలకు మెరుగైన రుణాలు ఇవ్వడం తప్పనిసరి.

డిజిటల్​ పేమెంట్లు పెరుగుతున్నప్పటికీ..

ప్రస్తుతం 89 శాతం మంది భారతీయులకు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. యూపీఐ వ్యవస్థ ప్రతి నెలా 20 కోట్లకు పైగా లావాదేవీలను నిర్వహిస్తోంది. ఇది ప్రపంచ రియల్ టైమ్ పేమెంట్లలో సగానికి సమానం. ఇంతటి ప్రగతి ఉన్నప్పటికీ కొన్ని ప్రధాన లోపాలు కనిపిస్తున్నాయి. సుమారు 16 శాతం బ్యాంకు ఖాతాలు నిరుపయోగంగా ఉన్నాయి. 15 శాతం మంది మాత్రమే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, సహకార సంఘాల (ఫార్మల్ క్రెడిట్) నుంచి లోన్లు పొందగలుగుతున్నారు. ఇది 24 శాతం ఉన్న ప్రపంచ సగటుతో పోలిస్తే చాలా తక్కువ. బీమా వ్యాప్తి జీడీపీలో 3.7 శాతంగా ఉంది. 

ఇది ప్రపంచ సగటులో సగం మాత్రమే. ఈ అడ్డంకులను తొలగించడానికి ప్రభుత్వం,  బ్యాంకింగ్ వ్యవస్థలు సమగ్ర చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్ వర్క్ ద్వారా నగదు ప్రవాహ ఆధారిత లోన్లను ఎంఎస్ఎంఈలకు అందజేయాలి. చిన్న వ్యాపారులకు, దుకాణదారులకు, కళాకారులకు తక్కువ వడ్డీకే అప్పులు అందేలా చూడాలి. దేశమంతటా ఆర్థిక అక్షరాస్యతను పెంచడం, బీమా కవరేజీని విస్తరించడం,  డిజిటల్ అంతరాలను తగ్గించడం ద్వారా అందరికీ ఆర్థిక వృద్ధి ఫలాలను అందించవచ్చని నివేదిక సూచించింది.