భద్రాచలం,వెలుగు: భద్రాచలం సీతారామ ఆలయ ఆలయ విస్తరణ పనులతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగొద్దని, శాస్త్రోక్తంగా పనులు చేపట్టాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్అంకిత్అధికారులను ఆదేశించారు.
రూ.200.89కోట్లతో ఆలయంలో చేపట్టే పనులను శనివారం వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాచలాన్ని టెంపుల్ సిటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.540కోట్లను మంజూరు చేసిందని వివరించారు.
శ్రీరామనవమి పర్వదినాన సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ జరిగిందని, దశలవారీగా పనులు నిర్వహించే క్రమంలో రూ.350 కోట్లు శాంక్షన్ చేయగా.. రూ.200కోట్లతో పనులు ప్రారంభించినట్లు చెప్పారు. 2027 జూన్‌లో ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాల నాటికి పూర్తిస్థాయిలో దేవస్థానం విస్తరణ పనులు పూర్తిచేయాలన్నారు.
భక్తుల రాకపోకలు, క్యూలైన్లు, తాగునీరు, శానిటేషన్, భద్రత తదితర ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఈవో దామోదర్‌రావు, ఇరిగేషన్ఈఈ జానీ, సర్పంచ్ పూనెం కృష్ణదొర, స్థానాచార్యులు స్థలసాయి పాల్గొన్నారు.
