- రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ‘సర్’పై బీఆర్ఎస్ శ్రేణులకు శిక్షణ
ఇబ్రహీంపట్నం, వెలుగు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను పార్టీ నాయకులు, కార్యకర్తలు సీరియస్‌గా తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా అలర్ట్‌గా ఉండాలన్నారు. ‘‘రాష్ట్రంలో రేవంత్ ఫ్యూచర్‌కే దిక్కులేదు.. రాహుల్ గాంధీకి కోపం వస్తే ఒక్కరోజులో ఆయన ఫ్యూచర్ పోతది. రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు..రెన్యూవల్ సీఎం” అని విమర్శించారు.
శనివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ ‘సర్’ శిక్షణ, బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా ఫార్మాసిటీ కోసం 14 వేల ఎకరాలు సేకరిస్తే.. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఫార్మా సిటీ రద్దు చేస్తామంటూ పొంకనాలు కొట్టారని అన్నారు. ఫార్మా సిటీ రద్దుచేసి, ఆ భూములు తిరిగి రైతులకు ఇస్తామని చెప్పారని.. కానీ ఇప్పుడు ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ పేరిట అన్నదమ్ములు విలువైన భూములపై పడి దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆ భూములు వెనక్కి ఇచ్చేది లేదని మాట మార్చారన్నారు.
మొత్తం రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని తెలిపారు. రైతుల భూములు గుంజుకోవడమే రేవంత్ సర్కారు ఏకైక లక్ష్యమని అన్నారు. 16 వేల ఎకరాలు కాదు.. మొత్తం 30 వేల ఎకరాలతో ఫ్యూచర్ సిటీ అంటూ ఊదరగొడుతున్నారని, ఓ పిచ్చోడి చేతిలో రాయి ఉంటే చుట్టుపక్కల ఉన్న వారికి నష్టమని, అదే పిచ్చోడి చేతిలో రాష్ట్రం ఉంటే నాలుగు కోట్ల ప్రజలకు నష్టమని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి కాదు.. హిట్లర్ రెడ్డి
ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఓ హిట్లర్ రెడ్డి అని కేటీఆర్ అన్నారు. తనకు హిట్లరే ఆదర్శం అని రేవంతే స్వయంగా ఒప్పుకున్నాడని, ఎవరైనా శ్రీ రామచంద్రుడు, బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుంటరాని.. కానీ.. నరకాసరుడు, రావణాసురుడిని మించిన హిట్లర్ తనకు ఆదర్శమని రేవంత్ రెడ్డి అంటున్నారని ఎద్దేవా చేశారు. 420 అబద్ధాలతో ప్రజలను నమ్మించి గద్దెనెక్కాడని, ఇప్పుడు రైతుబంధు దేవుడెరుగు.. కనీసం యూరియాకు కూడా రాష్ట్రంలో దిక్కులేదని పేర్కొన్నారు.
‘‘యూరియా షాపులో కాదు.. యాపులో పెడ్తం అన్నరు. ఇప్పుడు యాప్‌లో యూరియా కాదు కదా అందులో చివరికి రంగారెడ్డి జిల్లా పేరు లేదు.. మల్కాజిగిరి పేరు కనిపించడంలేదు. ఇక్కడ బ్రహ్మాండమైన రైతులున్నా రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా?” అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల పాతర, కుంభకోణాల జాతర నడుస్తున్నదని
మండిపడ్డారు. సీఎంగా రేవంత్ ఉన్నా, ప్రజలు కేసీఆర్ గారినే తలుచుకుంటున్నారని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసేది పక్కా అని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయంపై పూర్తి నమ్మకం కలుగుతున్నదని చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డిజిటల్ రూపంలో విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి కార్యకర్తకు పార్టీ తరఫున ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేస్తామని తెలిపారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, శంభీపూర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
