అమ్రాబాద్, వెలుగు: నాగర్‌కర్నూల్‌జిల్లా అమ్రాబాద్ టైగర్ సఫారీని మూడు నెలలపాటు నిలిపివేయనున్నారు. వన్యప్రాణుల సంతానోత్పత్తి సమయం కావడంతో జులై 1 నుంచి సెప్టెంబర్ 31 వరకు నల్లమలలో సఫారీ టూర్‌ను అధికారులు బంద్‌పెట్టారు. హైదరాబాద్– -శ్రీశైలం ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. శ్రీశైలం, ఉమామహేశ్వరం, మద్దిమడుగు ఆలయాల దర్శనానికి యాత్రికులు వస్తుంటారు.
సఫారీ టూర్‌లో భాగంగా నల్లమల అందాలను తిలకించేందుకు యాత్రికులు ఇష్టపడుతుంటారు. వన్యప్రాణుల సంతానోత్పత్తికి అనుకూల వాతావరణం కల్పించేందుకు సఫారీని బంద్ చేసినట్లు అధికారులు తెలిపారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ఉంచారు. ఈ మూడు నెలల పాటు నిబంధనలకు విరుద్ధంగా నల్లమలలోకి ప్రవేశిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు.
