లక్కీ భాస్కర్ ఇంపాక్ట్: వెంకీ అట్లూరిపై విపరీతమైన నమ్మకం.. థియేటర్లకు రాక ముందే లాభాల్లో సూర్య మూవీ

లక్కీ భాస్కర్ ఇంపాక్ట్: వెంకీ అట్లూరిపై విపరీతమైన నమ్మకం.. థియేటర్లకు రాక ముందే లాభాల్లో సూర్య మూవీ

టాలీవుడ్, కోలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ప్రస్తుతం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హాట్ టాపిక్‌గా మారింది. స్టార్ హీరో సూర్య హీరోగా, వరుస విజయాలతో దూసుకెళ్తున్న దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ పాన్-ఇండియా చిత్రం రేపు ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే సినిమా థియేటర్లలోకి రాకముందే ట్రేడ్‌లో భారీ సంచలనం సృష్టించింది. సుమారు రూ.130 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వివిధ రైట్స్ రూపంలో రూ.215 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో విడుదలకు ముందే నిర్మాతలు లాభాల బాట పట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ప్రీ-రిలీజ్ బిజినెస్‌ వివరాలు..

థియేట్రికల్‌ రైట్స్‌: రూ.90 కోట్లు
ఓటీటీ రైట్స్‌ (నెట్‌ఫ్లిక్స్‌): రూ.85 కోట్లు
ఆడియో రైట్స్‌: రూ.12 కోట్లు
శాటిలైట్‌ రైట్స్‌: రూ.28 కోట్లు
మొత్తం ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌: రూ.215 కోట్లు (ట్రేడ్ వర్గాల టాక్)

రూ.130 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమాకు రూ.215 కోట్ల మేర ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ జరగడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సూర్యకు ఉన్న పాన్‌ ఇండియా క్రేజ్‌, వెంకీ అట్లూరి గత చిత్రాల విజయాలు ఈ సినిమాకు భారీగా కలిసొచ్చినట్లు తెలుస్తోంది. 

భారీ హైప్‌కు కారణాలివే..

సూర్య క్రేజ్‌ & సరికొత్త లుక్‌:

సూర్య తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో ఆయన అంతర్జాతీయ పిస్టల్‌ షూటర్‌ సంజయ్‌ విశ్వనాథ్‌ పాత్రలో సరికొత్తగా కనిపించనున్నారని ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చింది. అంతేకాకుండా ఇందులో మమిత బైజు వంటి యంగ్ బ్యూటీతో ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ ఉండటం మరింత ఆసక్తిరేపుతుంది. దీంతో సూర్య అభిమానుల్లో సినిమాపై భారీ క్యూరియాసిటీ పెరిగింది.

‘లక్కీ భాస్కర్’ ఇంపాక్ట్: దర్శకుడు వెంకీ అట్లూరి రైటింగ్‌పై ట్రేడ్‌లో ఏర్పడిన నమ్మకమే ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అతిపెద్ద బలంగా మారింది. సాధారణ కథలను బలమైన భావోద్వేగాలు, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకునేలా చెప్పడంలో వెంకీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.

‘సార్’తో సామాజిక అంశాన్ని హిట్‌గా మలిచిన వెంకీ అట్లూరి.. ‘లక్కీ భాస్కర్’లో మధ్యతరగతి వ్యక్తి జీవితాన్ని థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు దగ్గర చేశారు. అదే ఎమోషనల్ రైటింగ్, రిలేటబుల్ క్యారెక్టరైజేషన్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లోనూ ఉంటుందనే నమ్మకంతోనే ట్రేడ్ వర్గాలు భారీగా పెట్టుబడి పెట్టినట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సూర్య స్టార్‌డమ్‌కు వెంకీ అట్లూరి రచన, కథనం తోడవడంతో ఈ సినిమా విడుదలకు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది.

భారీ తారాగణం & టెక్నికల్‌ వాల్యూస్‌:

ఈ చిత్రంలో సూర్యకు జోడీగా మమిత బైజు నటిస్తుండగా.. రాధికా శరత్‌కుమార్‌, రవీనా టాండన్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జి.వి. ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు టెక్నికల్‌ వాల్యూస్‌ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా మారనుంది. 

టీజర్‌, ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌:

ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. యాక్షన్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌, లవ్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన విజువల్స్‌కు మంచి స్పందన రావడంతో అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో దుమ్మురేపుతోంది. ఇలా మొత్తంగా విడుదలకు ముందే రూ.215 కోట్ల ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌తో ‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’ ట్రేడ్‌ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే భావోద్వేగాలతో పాటు సూర్య స్టైల్‌ యాక్షన్‌ కూడా ఈ సినిమాలో ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. మరి ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.