ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో అధికారులు ఒక గేటును అడుగు మేర ఎత్తి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ హిమాయత్ సాగర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు
అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్.. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ముందుగానే హిమాయత్ సాగర్ నిండినట్లు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వరద ప్రవాహం పెరిగిందని, అందుకే అధికారుల సూచనల మేరకు ముందస్తు జాగ్రత్తగా నీటిని దిగువకు వదులుతున్నామని వివరించారు. గత ఏడాది భారీ వర్షాల వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువ గేట్లు ఎత్తాల్సి వచ్చిందని.. అలాంటి ఇబ్బందులు మళ్లీ రాకుండా ఉండేందుకే, ఈసారి ముందస్తుగా వరద ఒత్తిడిని బట్టి దశలవారీగా నీటిని విడుదల చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నది, కాలువలు, లోతట్టు ప్రాంతాల వైపు ఎవరూ వెళ్లకుండా మధ్యాహ్నం నుంచే హెచ్చరికలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నీటి విడుదల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ, పోలీస్, వాటర్ బోర్డ్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రానున్న రోజుల్లో వచ్చే వరద ఉధృతిని బట్టి అవసరమైతే మరిన్ని గేట్లు ఎత్తి, దశలవారీగా నీటిని విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.
