- పొడి పరిస్థితులకు తోడు చలి గాలులు
- 10 జిల్లాల్లో 15 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు
- ఈసారి చలి తీవ్రత అధికంగా ఉంటుందని
- వాతావరణ నిపుణుల హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చలి గజగజ వణికిస్తున్నది. వానాకాలం ఇట్ల పూర్తయ్యిందో లేదో అట్ల చలి తీవ్రత పెరిగిపోయింది. సాయంత్రం 5 గంటల నుంచే చలి గాలులు వీస్తున్నాయి. ఉదయం 9 గంటల వరకూ చలి ప్రభావం ఉంటున్నది. నిజానికి ఈశాన్య రుతుపవనాలు ఈ నెల మధ్య వరకు ఉండాల్సి ఉన్నా, మొంథా తుఫాన్ ప్రభావంతో అవి త్వరగానే వెళ్లిపోయాయి. సెప్టెంబర్14న నైరుతి రుతుపవనాల తిరోగమనం మొదలవ్వగా, అక్టోబర్15 నాటికి పూర్తిగా నిష్క్రమించాయి. ఆ వెంటనే ఈశాన్య రుతుపవనాల కాలం మొదలుకాగా.. ఈ నెల మొదటి వారంలోనే అవి కూడా నిష్క్రమించాయి. అక్టోబర్27 నుంచి మూడ్రోజుల పాటు మొంథా తుఫాను ప్రభావం ఉండగా, 30 నాటికి అది బలహీనపడింది. ఆ తర్వాత రెండు మూడు రోజులు వర్షాలు పడినా, ఆ తర్వాత మాత్రం తగ్గిపోయాయి. తుఫాన్‌తో పాటే తేమ అంతా కూడా వెళ్లిపోవడంతో రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు చలి గాలులు పెరిగాయి. దీంతో గత రెండు రోజులుగా రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. పైనున్న ఆదిలాబాద్ నుంచి కిందున్న జోగులాంబ గద్వాల జిల్లా వరకూ చలి సాధారణం కన్నా ఎక్కువగా ఉంటున్నది. మరో 15 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఏడాది గత ఏడేండ్లలో ఎన్నడూ లేనంతగా చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అన్ని జిల్లాల్లోనూ ప్రభావం
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ చలి ప్రభావం అధికమైంది. శుక్రవారం అన్ని జిల్లాల్లోనూ 20 డిగ్రీల లోపే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 10 జిల్లాల్లో 15 డిగ్రీలలోపే కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్జిల్లా బేల, రంగారెడ్డిలోని షాబాద్, కామారెడ్డిలోని మాచాపూర్, మెదక్‌లోని మిన్పూరులో14.7 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్‌జిల్లా లింగాపూర్‌లో 14.8, సంగారెడ్డిలోని సత్వార్‌లో 14.8, జగిత్యాలలో 14.8, నిజామాబాద్‌లోని జకోరాలో 14.8, సిరిసిల్లలోని గంభీరావుపేటలో 14.8, వికారాబాద్‌లోని నవాబ్‌పేటలో 14.8, సిద్దిపేటలోని పోతారెడ్డిపేటలో 15, నిర్మల్‌లోని కుంటాలలో 15.1, నారాయణపేటలోని గుండమాల్‌లో 15.2, మహబూబ్‌నగర్‌లోని బాలానగర్‌లో 15.6, మేడ్చల్‌లో 15.6, నాగర్‌కర్నూల్‌లోని వెల్దండలో 15.7, నల్గొండలోని సింగరాజపల్లిలో 16.6, జనగామలోని బచ్చన్నపేటలో 16.9 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక వనపర్తి జిల్లా పెద్దమందాడిలో 17, కరీంనగర్‌లోని వెదురుగట్టులో 17, యాదాద్రిలోని జలాల్‌పూర్‌లో 17.1, గద్వాలలోని మల్లాపూర్‌లో 17.2, పెద్దపల్లిలోని జూలపల్లిలో 17.3, మంచిర్యాలలోని తాండూరులో 17.3, వరంగల్‌లోని సంగెంలో 17.9 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు
నమోదయ్యాయి.
హైదరాబాద్‌లోనూ గజగజ..
హైదరాబాద్‌లోనూ చలి గజగజ వణికిస్తున్నది. ఉదయం 9 గంటల వరకు పొగమంచు ప్రభావం ఉంటున్నది. సిటీ పరిధిలోని శంకర్‌పల్లిలో అత్యల్పంగా 14.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొయినాబాద్‌లో 15, రాజేంద్రనగర్‌లో 15.3, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్వద్ద 15.3, బీహెచ్‌ఈఎల్‌లో 15.5, మల్కాజిగిరిలో 15.7, కుత్బుల్లాపూర్‌లో 15.7, గచ్చిబౌలిలో 15.9, మారేడుపల్లిలో 16 చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
