NTR: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. జోర్డాన్ నుండి తృటిలో తప్పించుకున్న ఎన్టీఆర్ టీమ్!

NTR: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. జోర్డాన్ నుండి తృటిలో తప్పించుకున్న ఎన్టీఆర్ టీమ్!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చింది. ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన సైనిక దాడులతో అంతర్జాతీయంగా యుద్ధ భయం నెలకొంది. బాంబుల మోతతో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి.  అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతికారంగా ఇరాన్ ఏకంగా ఎనిమిది దేశాలలో ఉన్న యూఎస్ బేస్ క్యాంపులపై దాడులకు దిగింది. ఈ దాడుల నేపథ్యంలో ఇరాక్, యూఏఈ, జోర్డాన్, ఇజ్రాయెల్ దేశాలు తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేశాయి. అటు జోర్డాన్‌లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) అక్కడ ఉన్న భారతీయులకు, పర్యాటకులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. సురక్షిత ప్రాంతాల్లో తరలివెళ్లాలని సూచించింది. 

తృటిలో తప్పిన ముప్పు!

ఈ హెచ్చరికలు వెలువడగానే టాలీవుడ్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనికి కారణం, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ' డ్రాగన్'  షూటింగ్ గత కొన్ని రోజులుగా జోర్డాన్‌లోనే జరుగుతోంది. అయితే, చిత్ర యూనిట్ తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు ఇప్పుడు అందరికీ ఊరటనిస్తున్నాయి. 

నిజానికి ఈ షూటింగ్ మార్చి మొదటి వారం వరకు జరగాల్సి ఉంది. కానీ, అక్కడ నెలకొన్న ఉద్రిక్తతలను ముందుగానే పసిగట్టిన ప్రశాంత్ నీల్ టీమ్, ఫిబ్రవరి 22నే తమ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇండియాకు తిరుగు ప్రయాణమయ్యారు. ఒకవేళ షూటింగ్ మరో నాలుగు రోజులు ఆలస్యమై ఉంటే, ఎన్టీఆర్, వందలాది మంది చిత్ర యూనిట్ సభ్యులు అక్కడ చిక్కుకుపోయే ప్రమాదం ఉండేది.

జోర్డాన్ షెడ్యూల్ ఇలా..

ఈ కీలక షెడ్యూల్‌లో సినిమాకే హైలైట్‌గా నిలిచే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం.  జోర్డాన్‌లోని ఎడారి ప్రాంతాల్లో మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఇందుకోసం ఎన్టీఆర్ ఎటువంటి డూప్ లేకుండా రిస్క్ తీసుకుని స్టంట్స్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలోని ఒక మాస్ సాంగ్‌ను కూడా అక్కడి లొకేషన్లలో షూట్ చేసినట్లు సమాచారం. ఈ షెడ్యూల్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

అభిమానుల్లో రిలీఫ్

ప్రస్తుతం ఎన్టీఆర్ సురక్షితంగా హైదరాబాద్ చేరుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సినిమా షూటింగ్ ఇప్పటికే జాప్యం జరుగుతున్న తరుణంలో, ఈ యుద్ధ పరిస్థితులు ఎక్కడ సినిమాను మరింత ఆలస్యం చేస్తాయో అని భయపడ్డారు. కానీ, చిత్ర యూనిట్ ప్లానింగ్ వల్ల విదేశీ షెడ్యూల్స్ అన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఇకపై జరగబోయే షూటింగ్ అంతా ఇండియాలోని రామోజీ ఫిల్మ్ సిటీ ,ఇతర ప్రాంతాల్లోనే ఉండటంతో సినిమా విడుదలపై ఎటువంటి ప్రభావం ఉండదని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఎన్టీఆర్ తన కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. 2026 జూన్ 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.