కల్తీకి కాదేదీ అనర్హం.. అన్నట్లు తయారైంది హైదరాబాద్ లో పరిస్థితి. సిటీ వాసులు ఎంతో ఇష్టంగా తినే పేనీలు తయారు చేసే విధానం చూసి టాస్క్ ఫోర్స్ పోలీసులే షాక్ కు గురయ్యారు. తయారీ గురించి తెలిస్తే ఇన్నాళ్లు ఇలాంటి తిండి తిన్నామా..? అని ఆశ్చర్యపోక మానదు. గోడలకు గుట్కా పాన్ గుర్తులు, పనిముట్లకు అర ఇంచు మందం పట్టిన మురికి, ఈగలు వాలుతున్న కిచెన్, మళ్లీ మళ్లీ మరిగిస్తున్న నూనె, డాల్డా.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆకర్శణీయంగా ఉండే పేనీలను ఇంత దారుణంగా తయారు చేస్తున్నారా..? అనుకోవాల్సిందే.
వివరాల్లోకి వెళ్తే.. శనివారం (2026, ఫిబ్రవరి 28) హైదరాబాద్ జియాగూడలో కల్తీ పేనీ తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ అధికారులు, కుల్సుంపురా పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో నాసిరకం ఆహార తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గోడలపై ఎటు చూసినా గుట్కా, పాన్ ఊసిన గుర్తులతో వాంతికొచ్చేలా ఉన్న పరిసరాలను చూసి షాకయ్యారు.
పేనీలు తయారీ కేంద్రం నిర్వహకుడు ధనరాజ్ పూరి (36) ఈ సందర్భంగా అరెస్ట్ చేశారు. ధనరాజ్ జియాగూడలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలో జె.బి. ఫుడ్స్ పేరుతో ఎటువంటి అనుమతులు లేకుండా గోదాంను నిర్వహిస్తున్నాడు. ఎఫ్.ఎస్.ఎస్.ఐ (FSSAI) మార్గదర్శకాలను తుంగలో తొక్కి, తక్కువ ధరకే లభించే నాణ్యత లేని మైదా, వనస్పతిని ఉపయోగిస్తూ ఆహార పదార్థాలను తయారు చేస్తున్నాడు.
అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో తయారైన ఈ పేనీని స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తూ, ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఇటువంటి కల్తీ పదార్థాల వినియోగం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిందితుడి నుంచి దాదాపు 4 లక్షల రూపాయల విలువైన సరుకు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఆపరేషన్ జరిగింది. నిందితునిపై కుల్సంపుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు:
- 260 కేజీల సిద్ధం చేసిన నాణ్యత లేని పేనీ
- 150 కేజీల విడి పేనీ
- 950 కేజీల మైదా పిండి (19 బస్తాలు).
- 1,500 కేజీల వనస్పతి / డాల్డా (100 బాక్సులు).
- పిండి కలిపే యంత్రం (Dough Mixer),
- 2 బరువు తూచే యంత్రాలు.
- 180 కేజీల మరిగిస్తున్న నెయ్యి/నూనె మిశ్రమం.
- 19 హెచ్.పి (HP) గ్యాస్ సిలిండర్లు.
