T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పెను మార్పులు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. పాక్ జట్టు ప్రదర్శన ఎలా ఉన్నా, కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)కు చెందిన విశ్వసనీయ వర్గాలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. జట్టు ప్రదర్శనపై పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. మెగా టోర్నీలో టీమ్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం అతడ్ని తీవ్ర నిరాశకు గురి చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కెప్టెన్సీలో మార్పు తప్పదని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి.
కేవలం సల్మాన్ అలీ ఆఘానే కాకుండా, మరి కొంత మంది సీనియర్ ప్లేయర్స్ భవిష్యత్తుపై కూడా అనిశ్చితి నెలకొంది. ప్రస్తుత టోర్నమెంట్ వారికీ జాతీయ జట్టుతో చివరి మెగా ఈవెంట్ కావొచ్చనే చర్చలు వినిపిస్తున్నాయి. జట్టు పునర్వ్యవస్థీకరణపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తుంది. టీ20 వరల్డ్ కప్ అనంతరం పాక్ టీమ్ లో భారీగా మార్పులు జరిగే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అభిమానులు, మాజీ ఆటగాళ్లు కూడా జట్టులో కొత్త ఆలోచనలకు, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. మెగా ఈవెంట్ ఫలితం ఎలా ఉన్నా, పాకిస్తాన్ క్రికెట్‌లో త్వరలోనే మార్పులకు సంబంధించిన కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్–8లో భాగంగా పల్లెకెలె అంతర్జాతీయ మైదానంలో ఇవాళ శ్రీలంకతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడబోతుంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ భారీ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. శ్రీలంక పైన 709+ పరుగుల తేడాతో విజయం సాధిస్తేనే సెమీ ఫైనల్ లోకి పాకిస్తాన్ ఎంట్రీ ఇస్తుంది. లేదా ఛేజింగ్ చేసే సమయంలో 10.5 ఓవరలోనే శ్రీలంకను ఓడిస్తే.. అప్పుడు న్యూజిలాండ్ జట్టు ఇంటికి వెళ్లడం, పాకిస్తాన్ సెమీస్ కి వెళ్లడం జరుగుతుంది.
