చికెన్ అంటే ఇష్టం లేనోళ్ళు ఉంటారా చెప్పండి.. వారంతో పని లేకుండా రోజూ చికెన్ తినేవాళ్లు పెరిగిపోతున్నారు. ఇక ఆదివారం వచ్చిందంటే చాలు.. చికెన్ సెంటర్లన్నీ జనంతో కిటకిటలాడుతాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది చికెన్ ఫ్రీగా వస్తుందంటే జనం ఎగేసుకొని వెళ్లకుండా ఆగుతారా చెప్పండి.. హనుమకొండ జిల్లాలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనం. హైవే పక్కన వేలకొద్దీ నాటుకోళ్లు ప్రత్యక్షమవ్వడంతో సంచులతో జనం ఎగబడ్డారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
హనుమకొండలో ఎల్కతుర్తి- సిద్ధిపేట నేషనల్ హైవే పక్కన ఎలా వచ్చాయో ఏమో కానీ.. వేలకొద్దీ నాటుకోళ్లు ప్రత్యక్షమయ్యాయి.. దీంతో కోళ్లను దక్కించేందుకు జనం పరుగులు తీశారు. గుర్తు తెలియని వ్యక్తులు హైవే పక్కన వేలకొద్దీ నాటుకోళ్లు వదిలేసి వెళ్లడంతో కోళ్ల కోసం పత్తి చేల వెంట పరుగులు తీశారు జనం. కొంతమంది ఒకటి, రెండు కోళ్లతో సరిపెట్టుకొని చేతుల్లో పట్టుకొని వెళ్లగా.. మరికొంతమంది దొరికిన కాడికి దొరికినట్లు పదులకొద్దీ కోళ్ళను సంచుల్లో వేసుకొని పరుగులు తీశారు.
సుమారు రెండు వేల కోళ్లు వదిలి వెళ్లారని అంటున్నారు స్థానికులు. ఇంత పెద్ద సంఖ్యలో నాటుకోళ్లను ఎవరు వదిలారు.. ఎందుకు వదిలివెళ్లారు అంటూ చర్చించుకుంటున్నారు స్థానికులు. ఇవాళ చాలా కుటుంబాలకు ఫ్రీగా చికెన్ విందుభోజనం దొరికినట్లయిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు జనం.
అయితే.. ఆ కోళ్లకు ఏదైనా ఇన్ఫెక్షన్ గట్రా సోకడంతో కోళ్ల ఫామ్ నిర్వాహకులు ఇలా రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళారా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా ఫ్రీగా కోళ్లు దొరికేసరికి.. ఇంకో ఆలోచన లేకుండా జనం ఎగబడటం ఒకింత విడ్డురంగా ఉందనే చెప్పాలి.
