ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎంతలా అంటే గ్యాస్, ఆయిల్ సరఫరాలో అంతరాయం కారణంగా స్థంభించిపోయేంతలా. ఇరాన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. అణ్వాయుధాల తయారీని అడ్డుకుంటామని యూఎస్–ఇజ్రెయెల్ మొదలెట్టిన యుద్ధం వేల మందిని బలిదీసుకుంది. ఎప్పుడు ఏ బాంబు నెత్తిమీద పడుతుందోనని.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని అక్కడి జనం బతుకుతున్న పరిస్థితి.
మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనుకునేలా సాగుతున్న ఈ వార్ లో ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. ఖమేనీ తర్వాత ఆయన కుమారుడు మజ్తాబా ఖమేనీని సుప్రీం లీడర్ గా ప్రకటించింది ఇరాన్. అయితే.. ఇరాన్ కు కాబోయే అగ్రనేతను తామే నియమిస్తామని.. మతాధికారుల పాలన కాకుండా.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకవేళ మళ్లీ పాత పద్ధతిలోనే సుప్రీం లీడర్స్ ను ఎన్నుకుంటే వారిపై కూడా దాడి చేస్తామని హెచ్చరించారు.
ఈ పరిస్థితుల్లో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా ఖమేనీని ఇరాన్ ప్రకటించుకుంది. అయితే మొజ్తాబా ఖమేనీ (56) తీవ్ర గాయాలపాలైనట్లు ఇరాన్ స్థానిక మీడియా ద్వారా తెలుస్తోంది. ఇరాన్ జాతీయ టీవీ.. జాన్ బాజ్ ఆఫ్ రమదాన్ అంటూ మీడియా పేర్కొనడంతో.. ఆయన తీవ్ర గాయాలపాలైనట్లు భావిస్తున్నారు. జాన్ బాజ్ ఆఫ్ రమదాన్ అంటే గాయపడిన యుద్ధ వీరుడు అని అర్థం. గాయపడిన స్థితిలో ఉన్నారు లేక తీవ్రంగా గాయపడ్డారు అనే అర్థంలో ఇరాన్ మీడియా వ్యాఖ్యానించినట్లు ఈ స్టేట్మెంట్ ఆధారంగా తెలుస్తోంది. దీనికి తోడు సుప్రీం లీడర్ గా నియమితులైన నాటి నుంచి ఇప్పటి వరకు ఆయన బయటకనపడక పోవడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
ఎవరీ మొజ్తాబా ఖమేనీ:
మొజ్తాబా హస్సేనీ ఖమేనీ (56) ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్. ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంతో వారసుడిగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఇరాన్ లో సర్వాధికారాలు కలిగిన నేత. ఆయతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడు ఆయన. 1969లో షియా పవిత్ర నగరం మషాద్ లో జన్మించారు. యుక్త వయసులోని ఇరాన్–ఇరాక్ యుద్ధంలో పనిచేశారు. ఇరాన్ అత్యంత శక్తివంతమైన సైనిక సంస్థ.. ఇస్లాం రివొల్యూషనరీ గ్వార్డ్ కార్ప్స్ (IRGC) తో సన్నిహిత సంబంధాలున్న మొజ్తాబా ఎన్నికలో ఈ సైనిక సంస్థ పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
