జులై 1 నుంచి పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేత

 జులై 1 నుంచి పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేత

ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే విషయం చెప్పింది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై అమల్లో ఉన్న తాత్కాలిక ఆంక్షలను జులై 1 నుంచి ఎత్తేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా హోర్మూజ్ జలసంధి క్లోజ్ అవడం.. ఇంధన సరఫరాకు ఆటంకాలు తలెత్తడం.. ఇలా పలు కారణాల వల్ల.. పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు రిటైల్ ఇంధన కేంద్రాల నుంచి పెట్రోల్, డీజిల్ బల్క్లో కొనే విషయంలో కొన్ని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పెట్రోలియం ఉత్పత్తుల ప్రస్తుత సరఫరా పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ఆంక్షలు ఇకపై అవసరం లేదని నిర్ధారణకు వచ్చింది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ద్వారా నిర్వహించబడే రిటైల్ అవుట్లెట్ల ద్వారా పెట్రోల్ మరియు డీజిల్ అమ్మకాలు, పంపిణీని నియంత్రించడానికి, మోటార్ స్పిరిట్ అండ్ హై స్పీడ్ డీజిల్ (రిటైల్ అవుట్లెట్ల ద్వారా సరఫరాపై తాత్కాలిక నియంత్రణ) ఆర్డర్, జూన్ 12, 2026న తాత్కాలిక ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. జులై 1 నుంచి ఈ ఆంక్షలు ఎత్తివేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.

►ALSO READ | సాఫ్ట్వేర్ కోడలికి సిజేరియన్ భయం.. యూట్యూబ్ చూసి పురుడు పోసిన అత్త.. ఆ తర్వాత..

పెట్రోల్, డీజిల్ బంకుల్లో పెద్ద పెద్ద క్యాన్లు, పీపాల్లో పెట్రోల్, డీజిల్ కొట్టొద్దని.. వేల లీటర్లను పీపాల్లో నింపొద్దని.. అలాంటి వాళ్లకు పెట్రోల్, డీజిల్ అమ్మొద్దని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ జూన్ 12న కఠిన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రిటైల్ పెట్రోల్ బంకుల్లో బైక్స్, కార్లు, బస్సులు, లారీలు, ఆటోలు ఇలాంటి వాహనాల్లోనే పెట్రోల్, డీజిల్ నింపాలని.. పీపాలు తీసుకొస్తే పోయొద్దని స్పష్టం చేసింది. బల్క్ కొనుగోళ్లపై నిషేధం 90 రోజులు అమల్లో ఉంటుందని ప్రకటించినప్పటికీ.. సరఫరాకు ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో ఈ ఆంక్షల నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.