ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు ఊరట.. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు ఊరట.. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. ప్రభాకర్ రావుకు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. రూ.35 వేల పూచీకత్తుతో పాటు ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీతో ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా విదేశీ పర్యటన చేయొద్దని ప్రభాకర్ రావును ఆదేశించింది. సాక్షులు, ఆధారాలను ప్రభావితం చేయొద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్పై మార్చి 10, 2026న విచారణ జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఎస్‌‌‌‌ఐబీ కేంద్రంగా ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌కు పాల్పడినట్లు 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో ప్రభాకర్ రావుపై  కేసు నమోదైంది.

ఎస్ఐబీకి నేతృత్వం వహించిన ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ ఇస్తేనే భారతదేశానికి తిరిగి వస్తానని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం తిరస్కరించింది.

హైకోర్టు తీర్పును 2025 మే 9న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో ఆయన దేశానికి వచ్చి సిట్ విచారణకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టులో రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో ప్రభాకర్ రావుకు అరెస్ట్ నుంచి బిగ్ రిలీఫ్ దక్కినట్లయింది.