యుద్ధం ముగించాలంటూ ట్రంప్‌కు సలహాదారుల హెచ్చరిక.. క్రూడ్ కోలుకోవటానికి 2 ఏళ్లు..

యుద్ధం ముగించాలంటూ ట్రంప్‌కు సలహాదారుల హెచ్చరిక.. క్రూడ్ కోలుకోవటానికి 2 ఏళ్లు..

ఇరాన్-అమెరికా మధ్య నడుస్తున్న యుద్ధం కేవలం క్షిపణులకు మాత్రమే పరిమితం కాలేదు.. అది ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ఊపేస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఆయన అత్యంత సన్నిహితులు, సలహాదారులు ఒక కీలక రిక్వెస్ట్ చేస్తున్నారు. యుద్ధాన్ని ఇక ఎంతమాత్రం పొడిగించవద్దని, వెంటనే ఒక 'ఎగ్జిట్ స్ట్రాటజీ' అదే యుద్ధాన్ని ఆపే ప్లాన్ సిద్ధం చేసుకోవాలని వారు ప్రైవేట్‌గా ఒత్తిడి తెస్తున్నారు. యుద్ధం గనుక ఇలాగే కొనసాగితే అమెరికాలో రాజకీయంగా ట్రంప్ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు భయపడుతున్నారు.

యుద్ధం ముగిసినా.. కష్టాలు తప్పవా?
ట్రంప్ మాత్రం పైకి అంతా బాగుంది, మన సైన్యం లక్ష్యాలను చేరుకుంది అని చెబుతున్నా, తెర వెనుక కథ వేరేలా ఉంది. చమురు ధరలు ఒకానొక దశలో బ్యారెల్‌కు 119 డాలర్లకు చేరడం ప్రపంచ మార్కెట్లను వణికించింది. ప్రస్తుతం అవి 94 డాలర్లకి పడిపోయినా.. ముప్పు ఇంకా పొంచే ఉంది. అసలు సమస్య ఏమిటంటే.. యుద్ధానికి ఇరు పక్షాలు 'సీజ్ ఫైర్' ప్రకటించినా.. గల్ఫ్ నుండి చమురు సరఫరా సాధారణ స్థితికి రావడం అంత తేలిక కాదు. దీనికి ప్రధాన కారణం మెరైన్ ఇన్సూరెన్స్ అంటున్నారు నిపుణులు. 

►ALSO READ | కేజీ పుచ్చకాయ రూ.7: ఎగుమతులు ఆగిపోవటంతో రైతులకు భారీ నష్టాలు..

ఇన్సూరెన్స్ కంపెనీల భయం..
ప్రపంచవ్యాప్తంగా సముద్రం ద్వారా రవాణా అయ్యే ముడి చమురులో 20 శాతం కేవలం 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' గుండానే వెళ్తుంది. యుద్ధం కారణంగా క్షిపణులు, డ్రోన్ దాడులు పెరగడంతో గ్లోబల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ మార్గంలో ప్రయాణించే నౌకలకు ఇన్సూరెన్స్ ఇవ్వడం నిలిపివేసాయి. ఐరోపా నిబంధనల (Directive 2009/138/EC) ప్రకారం.. రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు తమ క్యాపిటల్ సొమ్ము భారీగా పెంచుకోవాల్సి ఉంటుంది. నష్టపోయే అవకాశం 99.5% ఉన్నప్పుడు వారు ఇన్సూరెన్స్ ఇవ్వలేరు.

రికవరీకి రెండేళ్లు పట్టవచ్చు
రాజకీయంగా యుద్ధం ఈరోజే ముగిసినా.. ఇన్సూరెన్స్ కంపెనీలు మళ్లీ పాలసీలు ఇవ్వడానికి కనీసం 12 నుంచి 24 నెలల సమయం పడుతుంది. దాడులు పూర్తిగా ఆగిపోయాయని నమ్మే వరకు వారు రిస్క్ తీసుకోరు. అంటే యుద్ధం ముగిసినా చమురు కొరత, అధిక ధరలు మరో రెండేళ్ల పాటు కొనసాగే ప్రమాదం ఉంది. అందుకే ట్రంప్ సలహాదారులు ఈ ఆర్థిక గండం నుంచి బయటపడటానికి యుద్ధాన్ని త్వరగా ముగించాలని కోరుతున్నారు. యుద్ధం ముగియడం అంటే కేవలం తుపాకులు ఆగడం మాత్రమే కాదు.. ప్రపంచ మార్కెట్లు మళ్లీ భరోసా పొందడం కూడా అని వారు ట్రంప్ కి గుర్తు చేస్తున్నారు.