కేజీ పుచ్చకాయ రూ.7: ఎగుమతులు ఆగిపోవటంతో రైతులకు భారీ నష్టాలు..

 కేజీ పుచ్చకాయ రూ.7: ఎగుమతులు ఆగిపోవటంతో రైతులకు భారీ నష్టాలు..

వేసవి వచ్చిందంటే అందరూ తప్పకుండా తినే ఫ్రూట్ పుచ్చకాయ. నీరు ఎక్కువగా ఉంటూ వేసవి తాపాన్ని తీర్చటంలో దీనిని మించింది మరొకటి లేదు. ఎంత ఎండలో వచ్చినా ఒక చల్లడి పుచ్చకాయ ముక్క తింటే కడుపంతా హాయిగా అనిపిస్తుంది. అలాంటి వాటర్ మెలాన్ కి ప్రస్తుతం కష్టకాలం వచ్చింది. రంజాన్ మాసంతో పాటు వేసవి తాపాన్ని తీర్చాల్సిన పండుకు రవాణా కష్టాలు రావటంతో రైతుల నుంచి వ్యాపారుల వరకూ భారీగా నష్టపోతున్న పరిస్థితి ఏర్పడింది. 

ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న అనిశ్చితి పరిస్థితులు భారతీయ రైతులపై.. ముఖ్యంగా పుచ్చకాయ సాగుదారులపై కోలుకోలేని దెబ్బ తీశాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ వాణిజ్యంలో ఏర్పడిన ఆటంకాలు, భారతదేశం నుండి గల్ఫ్ దేశాలకు వెళ్లే పుచ్చకాయల ఎగుమతులను పూర్తిగా నిలిపివేసాయి. దీని ప్రభావంతో దేశీయ మార్కెట్లలో పుచ్చకాయల నిల్వలు పెరిగిపోయి, ధరలు భారీగా పతనమయ్యాయి.

గల్ఫ్ ఎగుమతులకు బ్రేక్..
సాధారణంగా రంజాన్ మాసంలో ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, ఒమన్ వంటి దేశాలకు భారత్ నుండి భారీగా పుచ్చకాయలు, ఖర్బూజాలు ఎగుమతి అవుతుంటాయి. ఈ ఏడాది కూడా ఎగుమతిదారులు పెద్ద ఎత్తున సరుకును సిద్ధం చేశారు. అయితే ఇరాన్ యుద్ధంతో ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల షిప్పింగ్ మార్గాలు మూతపడ్డాయి. దీంతో ఎగుమతి కావాల్సిన సరుకంతా దేశీయ మార్కెట్లకు మళ్లించబడుతోంది. దీంతో మార్కెట్లకు ఒక్కసారిగా పుచ్చకాయల తాకిడి పెరిగింది.

కుప్పకూలిన హోల్‌సేల్ ధరలు..
ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ అయిన ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో ధరల పతనం కొనసాగుతోంది. ఫిబ్రవరిలో క్వింటాల్ పుచ్చకాయ ధర రూ.3వేల 275 ఉండగా, మార్చి నాటికి అది రూ.2వేల 301 కు పడిపోయింది. అంటే కేవలం నెల రోజుల్లోనే 29% మేర ధరలు తగ్గాయి. అయితే గత ఏడాది మార్చిలో ఉన్న రూ.1,482 ధరతో పోలిస్తే ఇప్పుడు కొంచెం ఎక్కువే ఉన్నప్పటికీ.. ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చూస్తున్నారు.

►ALSO READ | కష్టకాలంలో వాటినే నమ్ముకుంటున్న మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు.. మరి మీరు?

పొలాల్లో దయనీయ స్థితి..
సోషల్ మీడియాలో రైతులు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలు షేర్ చేస్తున్న వివరాలు మరింత కలచివేస్తున్నాయి. కర్ణాటకకు చెందిన అరుణ్ ఉర్స్ అనే వ్యాపారి కొన్ని ప్రాంతాల్లో పుచ్చకాయ ధర కేవలం రూ.7కి పడిపోయిందని పోస్ట్ చేశారు. క్వాలిటీ బాగున్నా కొనేవారు లేక రైతులు తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. గతంలో పొలం వద్ద కిలో రూ.25 పలికిన పుచ్చకాయ, ఇప్పుడు రూ.6-రూ.7 కే అడుగుతున్నారని, వ్యాపారులు ఎగుమతులు లేవనే సాకుతో ధరలు తగ్గించేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.

హోల్‌సేల్ మార్కెట్లు, పొలాల వద్ద ధరలు పడిపోయినప్పటికీ.. క్విక్ కామర్స్ యాప్స్‌లో మాత్రం ధరలు ఇంకా తగ్గనేలేదు. ఢిల్లీలో కిలో పుచ్చకాయ రూ.100కు పైనే ఉండగా.., బెంగళూరులో రూ.80 వరకు అమ్ముతున్నాయి క్విక్ కామర్స్ కంపెనీలు. అంటే హోల్‌సేల్ రేట్లలో పతనం ప్రయోజనం సామాన్య వినియోగదారుడికి పూర్తిస్థాయిలో చేరడం లేదు, మధ్యవర్తులు.. ప్లాట్‌ఫారమ్‌లే లాభపడుతున్నాయి. యుద్ధ ప్రభావం సామాన్య రైతు నుంచి వంటింటి బడ్జెట్ వరకు ఉంటుందని ఈ పుచ్చకాయ ధరల పతనం నిరూపించింది.