పెట్రో రేట్ల భారం, ఈ 20 ఇంధనం ఎఫెక్ట్..తెలంగాణలో జోరుగా ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ కొనుగోళ్లు

పెట్రో రేట్ల భారం, ఈ 20 ఇంధనం ఎఫెక్ట్..తెలంగాణలో జోరుగా ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ కొనుగోళ్లు
  •         రాష్ట్ర సర్కారు నుంచి పన్ను మినహాయింపుతో మరింత ఊపు
  •     కేవలం 20 నెలల వ్యవధిలోనే 1.73 లక్షల పైగా కొత్త వాహనాల కొనుగోళ్లు
  •     2019 మార్చి నాటికి  రాష్ట్రంలో కేవలం 3,535 ఈవీలు.. ప్రస్తుతం  రాష్ట్రవ్యాప్తంగా  3.36 లక్షలకు పైనే!

హైదరాబాద్​, వెలుగు: పెట్రోల్, డీజిల్ ధ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ల మంట‌‌‌‌‌‌‌‌తో అల్లాడుతున్న సామాన్య, మ‌‌‌‌‌‌‌‌ధ్యత‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌తి ప్రజ‌‌‌‌‌‌‌‌లు ప్రత్యామ్నాయ ర‌‌‌‌‌‌‌‌వాణా వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న పన్ను ప్రోత్సాహకాలు, మెయింటెనెన్స్​లేకపోవడంతో ఎలక్ట్రిక్ వాహ‌‌‌‌‌‌‌‌నాల (ఈవీ)  కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.  ఈ 20  ఇంధనం వల్ల ఇంజిన్లు పాడవుతున్నాయనే టెన్షన్ ​కూడా ఈవీపై మొగ్గుకు మరో కారణమని ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్​ చెప్తున్నారు. మొత్తంగా ఒకప్పుడు ఎలక్ట్రిక్​ వాహనాల కొనుగోలును ప్రయోగంగా భావించిన జనం..  క్రమంగా ఈవీలను తమ తొలి ప్రాధాన్యతగా మార్చుకుంటున్నారు. 


రాష్ట్రంలో 2019 మార్చి నాటికి ఉన్న ఎలక్ట్రిక్​ వాహనాలు కేవలం 3,535 మాత్రమే..  కానీ ప్రస్తుతం ఆ సంఖ్య ఏకంగా 3.36 లక్షలకు  చేరింది.  ప్రస్తుతం రాష్ట్రంలో రోడ్లపై తిరిగే మొత్తం వెహికల్స్‌‌‌‌ సంఖ్యలో ఈవీల వాటా 1.78 శాతానికి చేరుకోవడం విశేషం. రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం 2024 నవంబర్‌‌‌‌‌‌‌‌లో జీవో 41 ద్వారా ఈవీ పాలసీ తీసుకొచ్చింది.  ఇందులో భాగంగా ఎలక్ట్రిక్​ వెహికల్స్‌‌‌‌పై  100% రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు ఇస్తున్నది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.  కేవలం 20 నెలల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 1.73 లక్షల ఎలక్ట్రిక్‌‌‌‌​ వాహనాలు అమ్ముడుపోయాయి.  మరోవైపు కొత్తగా ప్రభుత్వ శాఖల కోసం కొనుగోలు చేసే వాహనాలన్నీ తప్పనిసరిగా ఈవీ  అయి ఉండాలని, పెట్రోల్, డీజిల్ వాహనాల కొనుగోళ్లు బంద్​పెట్టాలని సీఎం రేవంత్​రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. మరోవైపు  ఆటో కార్మికులకు ఆర్థిక భారం తగ్గించి కాలుష్యాన్ని అరికట్టేందుకు ఓఆర్‌‌‌‌ఆర్ లోపల తిరిగే పాత డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే (రెట్రో ఫిట్టింగ్) బాధ్యతను ప్రభుత్వమే తీసుకోనున్నట్టు ప్రకటించారు.
సర్కారు నుంచి రూ.1,686 కోట్ల లబ్ధి.. 
ప్రభుత్వ ప్రోత్సాహకాలు, టాక్స్ మినహాయింపుల ఎఫెక్ట్​ టూ వీలర్​, ఫోర్​ వీలర్​ వాహన విభాగాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో ఈవీలకు విశేష స్పందన వస్తోంది.  ఇందులో వ్యక్తిగత ప్రయాణాలకు వినియోగించే కార్లు, బైక్‌‌‌‌ల విక్రయాలు ఎక్కువగా ఉంటున్నాయి.  టూ వీలర్ల విక్రయాలు 1,22,843 కాగా, వీటి యజమానులు రూ. 174  కోట్ల పన్ను ఆదా చేసుకున్నారు. ఇక లగ్జరీ విభాగంలో ఫోర్ వీలర్లు 35,410 అమ్ముడవగా, ఎక్కువ ధరలు ఉండటంతో కార్ల యజమానులకు ఏకంగా రూ. 1,442 కోట్ల మేర అత్యధిక లబ్ధి చేకూరింది. వీటికి తోడు వాణిజ్య ప్రయోజనాల కోసం వాడే ఎలక్ట్రిక్ ఆటోలు, గూడ్స్ క్యారియర్లు, ట్యాక్సీలు, బస్సులు కలిపి ఇతర కమర్షియల్ విభాగానికి చెందిన దాదాపు 13,780 వాహనాలు కొనుగోలు చేయగా, వీటికి రూ. 70.50 కోట్ల పన్ను మినహాయింపు దక్కింది.  మొత్తంగా 1.72 లక్షలకు పైగా కొనుగోలుదారులకు రూ. 1,686.29 కోట్ల మేర లబ్ధి  చేకూరింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయినప్పటికీ ఈవీ పాలసీని పొడిగిస్తూ వస్తున్నది. నిర్వహణ సులభంగా ఉండడం, మెయింటెనెన్స్​ లేకపోవడంతో కార్పొరేట్ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, డెలివరీ ఏజెంట్లు ఎలక్ట్రిక్​ స్కూటర్లను ఎంచుకుంటున్నారు. నగరాల్లో విద్యుత్ వాహనాల మౌలిక సదుపాయాలు, విడిభాగాల లభ్యత క్రమంగా పెరుగుతుండటంతో, సంప్రదాయ ఇంధన వాహనాల స్థానాన్ని ఈవీలు వేగంగా భర్తీ చేసే వాతావరణం కనిపిస్తున్నది.
విస్తరణకు అడ్డంకులు.. 
ఈవీ రంగాన్ని వేధిస్తున్న సవాళ్లు
ఓవైపు ఆదరణ పెరుగుతున్నప్పటికీ.. మరోవైపు ఈవీ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. అందులో మొదటిది ఫాస్ట్ చార్జింగ్,  వాటి స్టేషన్ల కొరత. నగర కేంద్రాల్లో కొన్ని చార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. నేషనల్​హైవేస్​, గ్రామీణ ప్రాంతాల్లో సరైన చార్జింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వాహనదారులు ‘రేంజ్ ఆందోళన’కు గురవుతున్నారు. నగరాలు, హైవేలలో ప్రతి 20- నుంచి 30 కిలో మీటర్లకు ఒక పబ్లిక్ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌‌‌‌ను, గ్రిడ్ సపోర్ట్‌‌‌‌తో అందుబాటులోకి తీసుకురావాలని సూచిస్తున్నారు. అపార్ట్‌‌‌‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌‌‌‌లలో చార్జింగ్ పాయింట్ల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ నిబంధనలు సవరించాలని అంటున్నారు.  రెండోది.. బ్యాటరీ మార్పిడి ఖర్చు. సాధారణంగా 4 నుంచి 6 ఏండ్ల వినియోగం తర్వాత బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుంది.. దానిని కొత్తగా వేయడానికి వాహనం అసలు ధరలో 30 నుండి 40 శాతం వరకు ఖర్చు చేయాల్సి రావడం వినియోగదారులను కలవరపెడుతోంది. వీటితోపాటు ప్రారంభ కొనుగోలు ధర  సంప్రదాయ వాహనాల కంటే ఎక్కువగా ఉండడం, వేసవి కాలంలో తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల బ్యాటరీలు వేడెక్కి అగ్ని ప్రమాదాలు జరుగుతాయనే భయాలు, రీసేల్ వాల్యూ (మళ్లీ విక్రయించేటప్పుడు వచ్చే ధర)పై స్పష్టత లేకపోవడం లాంటివీ వెనుకడుగువేసేలా చేస్తున్నాయి. స్థానికంగానే బ్యాటరీల తయారీ, రీసైక్లింగ్ ప్లాంట్లను నెలకొల్పడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, భవిష్యత్తులో ఈవీ కార్లు,  బైక్‌‌‌‌లను సామాన్యుడికి మరింత అందుబాటులోకి వచ్చేలా చేయాలని ఎక్స్‌‌‌‌పర్ట్స్​ సూచిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలను కఠినతరం చేస్తూ బీఐఎస్ నిబంధనలకు తగ్గట్టుగా సురక్షితమైన బ్యాటరీలను మార్కెట్లోకి తెస్తే అమ్మకాలు మరింత పుంజుకుంటాయని చెబుతున్నారు.

పర్యావరణానికి ఎంతో మేలు
రోడ్లపై పెట్రోల్, డీజిల్ వాహనాల సంఖ్య క్రమంగా తగ్గి ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగితే సమాజానికి, పర్యావరణానికి అపారమైన ప్రయోజనాలు దక్కనున్నాయి. ప్రధానంగా నగరాల్లో నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సూక్ష్మ ధూళి కణాల (పీఎం 2.5) ఉద్గారాలు గణనీయంగా తగ్గి వాయు కాలుష్యం అదుపులోకి వస్తుంది. దీంతో ఢిల్లీ, ముంబైలాంటి పరిస్థితులు హైదరాబాద్‌‌‌‌కు వచ్చే అవకాశం ఉండదు.  ప్రజల్లో శ్వాసకోశ, గుండె సంబంధ వ్యాధులు తగ్గి ప్రజారోగ్యంపై ఖర్చు తగ్గుతుంది. జాతీయ స్థాయిలో పరిశీలిస్తే.. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గడం వల్ల విదేశీ మారక నిల్వలు ఆదా కానున్నాయి.

ప్రయాణ ఖర్చు ఆదా.. జీరో మెయింటెనెన్స్  
లీటర్‌‌‌‌‌‌‌‌ పెట్రోల్ రూ. 115  దాటిన పరిస్థితుల్లో ఈవీ వాహనాలు సగటు జీవికి   ఊరటనిస్తున్నాయి. పెట్రోల్ బండిపై కిలోమీటరు ప్రయాణానికి రూ. 2.20 నుంచి రూ. 2.50 వరకు ఖర్చవుతుంటే, ఈవీ స్కూటర్‌‌‌‌పై అయ్యే ఖర్చు కేవలం 20 నుంచి 30 పైసలు మాత్రమే. రోజూ 30 కిలో మీటర్లు తిరిగే వ్యక్తికి పెట్రోల్ బైక్‌‌‌‌పై నెలకు రూ. 2,300 దాకా ఖర్చయితే, ఈవీపై కేవలం రూ. 250 మాత్రమే అవుతుంది. ఫోర్ వీలర్ విషయానికొస్తే పెట్రోల్, డీజిల్ కార్లకు కిలో మీటర్‌‌‌‌‌‌‌‌కు రూ. 7  నుంచి రూ. 8 వరకు వ్యయమవుతుంటే, ఈవీ కార్లకు హోమ్ చార్జింగ్‌‌‌‌తో రూ. 1  నుంచి రూ. 1.30 మాత్రమే ఖర్చవుతోంది. నెలకు 1500 కిలో మీటర్లు తిరిగే కారు యజమానికి ఏటా ఏకంగా లక్ష రూపాయల పైన  ఇంధన వ్యయం ఆదా అవుతోంది. దీనికి తోడు పెట్రోల్ బండ్లలాగా ఇంజిన్ ఆయిల్, గేర్ బాక్స్, క్లచ్ ప్లేట్ల మార్పిడిలాంటి పనులు ఈవీలలో ఉండవని..  మెయింటెనెన్స్ ఖర్చు దాదాపు 60 శాతం తగ్గిపోతుండటం వాహనదారులకు కలిసివస్తున్నది.