- తనిఖీలు పెంచిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ
- లేబుల్స్‌ను మారుస్తున్న కంపెనీలు
న్యూఢిల్లీ: తమ దాని కంటే మరే ఇతర కంపెనీ ప్రొడక్టు సాటిరాదని అర్థం వచ్చేలా కొన్ని సంస్థలు చేస్తున్న ప్రకటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. పరిశుభ్రత పాటించని సంస్థల లైసెన్సులను రద్దు చేస్తోంది. దీంతో ఆహార, పానీయాల కంపెనీలు తమ వస్తువుల లేబుళ్లు, ప్యాకింగ్, ప్రకటనలను మార్చుతున్నాయి. మనం రోజూ తినేవాటి గురించి తయారీదారులు ఏం చెబుతుతున్నారనే విషయమై ప్రభుత్వ ఏజెన్సీలు నిఘా పెట్టాయి. పిండి, పనీర్, టీ, జ్యూసులు, బిస్కెట్లు, నెయ్యి, తేనె, చాక్లెట్లు, ఎనర్జీ డ్రింక్స్ లేబుళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.
ఈ తనిఖీలు తినే పదార్థాలకే కాకుండా విస్కీ వంటి వాటికి కూడా తప్పడం లేదు. తప్పుదారి పట్టించే ప్రకటనలు, లేబుళ్ల పద్ధతులపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)కఠిన చర్యలు తీసుకుంటోంది. దీంతో కొన్ని కంపెనీలు కోర్టులను ఆశ్రయించాయి. డాబర్, డియాగో వంటి కంపెనీలు న్యాయపోరాటం చేస్తున్నాయి. నిజానికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొత్త రూల్సేమీ అమలు చేయడం లేదని, పాత వాటినే ఇప్పుడు కఠినంగా అమలు చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.
ఆధునిక టెక్నాలజీలు, పరికరాలతో వస్తువులను పరీక్షిస్తూ నిజానిజాలను నిగ్గుతేలుస్తోందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మాజీ చీఫ్ పవన్ అగర్వాల్ అన్నారు. వినియోగదారులు ప్రకటనలను ఎలా అర్థం చేసుకుంటున్నారనే దానిపై అధికారులు దృష్టి పెట్టారని చెప్పారు. ఎనర్జీ డ్రింక్స్ విషయంలో కొన్ని అపోహలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. పెరగడంతో బ్రాండ్లు వివాదాస్పద ప్రకటనలతో ప్రచారం చేసుకుంటున్నాయని పవన్ పేర్కొన్నారు.
టెస్టుల్లో దొరికిపోయిన కంపెనీలు
ఆహార, పానీయాల కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకోవడానికి గొప్పగా ప్రకటనలు ఇస్తున్నాయి. వీటిలో కొన్ని తప్పుదారి పట్టించే విధంగా ఉంటున్నట్టు తేలింది. తేనె వంటి వస్తువుల విషయంలో కొన్ని కంపెనీలు ‘100 శాతం స్వచ్ఛమైనవని’ అంటూ ప్రకటనలు ఇచ్చాయి. పరీక్షలలో అదంతా అబద్ధమని తేలడంతో వాటి అమ్మకాలను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. ఎనర్జీ డ్రింక్స్ సంస్థలు తమ పానీయాల వల్ల తక్షణ శక్తి వస్తుందని ప్రచారం చేశాయి. ఈ పానీయాల లేబుళ్లపై ‘ఎనర్జీ’ అనే పదాన్నే తొలగించాలని నిర్దేశించారు.
ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయనే భ్రమను కల్పిస్తున్నాయని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది. కొన్ని డెయిరీలు తాము అమ్మే నెయ్యి, పనీర్ పూర్తిగా స్వచ్ఛమైన పాలతో తయారవుతాయని చెప్పాయి. నిజానికి ఇవి నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదని టెస్టుల్లో తేలింది. కొన్ని కంపెనీలు తమ పండ్ల రసాలు నూటికి నూరు శాతం సహజమైనవని ప్రకటనలు ఇచ్చాయి. నిపుణుల పరిశీలనలో వాటిలో కృత్రిమ రంగులు, చక్కెర కలిపినట్లు తేలింది.
ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావడంతో ఈ తనిఖీలు మరింత పెరిగాయి. సామాన్యులు కూడా ఇప్పుడు వస్తువుల లేబుళ్లను చాలా జాగ్రత్తగా చదువుతున్నారు. సోషల్ మీడియాలో ఉండేవాళ్లు, ఆరోగ్య నిపుణులు, వినియోగదారుల సంఘాలు వస్తువులను నిశితంగా పరిశీలిస్తున్నాయి.
