- యూపీఐ చార్జీలపై అపోహలు వద్దు: కేంద్రం
- రూ.2 వేలు దాటిన వ్యాపార చెల్లింపులకే ఎండీఆర్ వర్తిస్తుందని క్లారిటీ
న్యూఢిల్లీ: యూపీఐ లావాదేవీలకు చార్జీలు పడబోతున్నాయనే ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సాధారణ ప్రజలు జరిపే యూపీఐ లావాదేవీలు ఎప్పుడూ ఉచితంగానే ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. దాని ప్రకారం.. పర్సన్ -టు -పర్సన్ (పీ2పీ) లావాదేవీలన్నీ యథావిధిగా కొనసాగుతాయి. భవిష్యత్తులో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్--–పీఐపై వ్యాపారుల నుంచి బ్యాంకులు వసూలు చేసే కమీషన్) ప్రవేశపెట్టినా.. అది సాధారణ వినియోగదారులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావం చూపదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. నిర్దిష్ట పరిమితికి మించి వ్యాపారులు జరిపే లావాదేవీలకు మాత్రమే.. అదికూడా నామమాత్రపు చార్జీలు వర్తిస్తాయని తెలిపింది. ముఖ్యంగా రూ.2,000 కంటే ఎక్కువ విలువైన వ్యాపార చెల్లింపులపైనే ఎండీఆర్ వర్తించే అవకాశం ఉంది. ఎండీఆర్ వల్ల పాలు, కూరగాయలు, కిరాణా సామాన్లు, ఆటో- ప్రయాణాలు, ట్యాక్సీ చార్జీలు వంటి సామాన్యుల రోజూవారీ రొటీన్ చెల్లింపులపై ఎలాంటి అదనపు భారం పడదని కేంద్రం వెల్లడించింది.
యూపీఐ భవిష్యత్తు మరింత సురక్షితం
దేశంలో యూపీఐ లావాదేవీల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీనివల్ల టెక్నికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్వహణ, సైబర్ భద్రత, డేటా ప్రొటెక్షన్, మోసాల నివారణకు భారీగా ఖర్చవుతోంది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007కు చేస్తున్న సవరణలు కేవలం ఒక సహాయక నిబంధన మాత్రమేనని ప్రభుత్వం వివరించింది. ఈ విధానంపై వస్తున్న విదేశీ ఒత్తిళ్ల వార్తలను కూడా ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. యూపీఐ లావాదేవీలపై ప్రజలు ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొంది.
