హైడ్రా డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ నియామకాలకు భారీ స్పందన..150 పోస్టుల కోసం 2,500 మంది హాజరు

హైడ్రా డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌  నియామకాలకు భారీ స్పందన..150 పోస్టుల కోసం 2,500 మంది హాజరు
  •     టోకెన్ల పంపిణీ
  •     మూడు రోజుల పాటు ఈవెంట్స్​ నిర్వహణ

ఎల్బీనగర్‌‌‌‌/హైదరాబాద్​ సిటీ, వెలుగు: హైడ్రా ఆధ్వర్యంలో చేపట్టిన డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ అసిస్టెంట్లు, డ్రైవర్‌‌‌‌ పోస్టుల నియామక ప్రక్రియకు నిరుద్యోగ యువత నుంచి భారీ స్పందన లభించింది. 100 మంది డీఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ అసిస్టెంట్లు, 50 మంది డ్రైవర్ల పోస్టుల భర్తీకి శనివారం హైదరాబాద్ లోని సరూర్‌‌‌‌నగర్‌‌‌‌ స్టేడియంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఉద్యోగాల సుమారు కోసం 2,500 మందికి పైగా అభ్యర్థులు తరలిరావడంతో స్టేడియం పరిసరాలు కిక్కిరిసిపోయాయి.హైడ్రా ముందుగానే ఈ నెల 8, 9 తేదీల్లో సరూర్‌‌‌‌నగర్‌‌‌‌ స్టేడియంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

పలువురు అభ్యర్థులు తెల్లవారుజామునే స్టేడియానికి చేరుకున్నారు. ఒక్కసారిగా వేలాది మంది అభ్యర్థులు హాజరు కావడంతో వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం, ఫిజికల్‌‌‌‌ టెస్టుకు టోకెన్లు జారీ చేయడంలో హైడ్రా అధికారులకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. కొంత తోపులాట జరగడంతో పోలీసులు చిన్నపాటి లాఠీచార్జి కూడా చేయాల్సి వచ్చింది. మొదట్లో స్వల్ప ఇబ్బందులు ఎదురైనా అనంతరం ఎంపిక ప్రక్రియ సజావుగా కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటలకు టోకెన్లు పంపిణీ చేశారు. ఆ తరువాత 3.30 గంటలకు ఈవెంట్స్​ ప్రారంభించారు. 

288 మందికి ఈవెంట్స్​ నిర్వహించారు. టోకెన్లు పంపిణీ చేసిన వారందరికీ మూడ్రోజుల పాటు ఈవెంట్స్​ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. టోకెన్లు ఉన్న వారు మాత్రమే ఈవెంట్స్​కు రావాలని తెలిపారు. ఒకేసారిగా ఎక్కువ మంది రావడంతో పాటు వర్షం కారణంగా ఈవెంట్స్​ ఆలస్యం అయ్యాయి. కాగా, హైడ్రా ఉద్యోగాల కోసం తరలివచ్చిన నిరుద్యోగ యువతపై పోలీసులు లాఠీచార్జి  చేయడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌‌‌‌. రాంచందర్‌‌‌‌రావు ఖండించారు. కేవలం 150 ఉద్యోగాల కోసం వేలాది మంది తరలిరావడం రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. ఉపాధి కోసం వచ్చిన యువతపై పోలీసులను ప్రయోగించడం ఏమిటని రాంచందర్‌‌‌‌రావు ప్రశ్నించారు.