అస్సాంను వదలని వర్షాలు..ఇంకా వరద ముప్పులోనే 13 జిల్లాలు

అస్సాంను వదలని వర్షాలు..ఇంకా వరద ముప్పులోనే 13 జిల్లాలు
  • 1.55 లక్షల మందిపై తీవ్ర ప్రభావం
  • ఇంకా వరద ముప్పులోనే 13 జిల్లాలు
  • 26 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

   గౌహతి: అస్సాంను వర్షాలు వదలడం లేదు. జులై మధ్యలో ప్రారంభమైన వానలు ఆగస్టులోనూ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల మొదటి వారం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటివరకు వర్షాల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 98కి చేరిందని అధికారులు శనివారం తెలిపారు. అలాగే, 1.55 లక్షల మందికిపైగా ప్రజలు ప్రభావితులయ్యారని వెల్లడించారు. శుక్రవారం నాటికి 13 జిల్లాలు (శివసాగర్, గోలాఘాట్, నాగావ్, హోజై, సోనిత్‌‌‌‌‌‌‌‌పూర్, ధేమాజీ, దర్రాంగ్, విశ్వనాథ్, కామరూప్ (ఎం), లఖింపూర్, ఉదల్‌‌‌‌‌‌‌‌గురి, జోర్‌‌‌‌‌‌‌‌హాట్, చరాయిదేవ్) ఇంకా వరదల నుంచి తేరుకోలేదని తెలిపారు. 


కాగా, ఆదివారం నుంచి ప్రభుత్వం నష్ట అంచనాను ప్రారంభించనుందని పేర్కొన్నారు. చరాయిదేవ్ జిల్లాలోని మహమోరా రెవెన్యూ సర్కిల్ లో ఒకరు చనిపోయారని.. దీంతో మృతుల సంఖ్య 98కి చేరిందని అధికారులు తెలిపారు. మొత్తం 1,55,849 మంది ప్రజలు వరదల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గోలాఘాట్ జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైందని.. ఇక్కడ 58,750 మంది ప్రభావితమయ్యారని వెల్లడించారు. ఆ తర్వాతి స్థానాల్లో శివసాగర్ (48,286), జోర్హాట్ (25,259) ఉన్నాయన్నారు. గురువారం నాటికి 15 జిల్లాల్లో 1.68 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితులయ్యారని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం 55 సహాయక శిబిరాలను నిర్వహిస్తూ.. 10 వేల మందికి పైగా నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించిందన్నారు. మరో 18 సహాయక పంపిణీ కేంద్రాలు కూడా పనిచేస్తున్నాయని, 10,748.64 హెక్టార్ల పంట నీట మునిగిందని తెలిపారు.

బాధితులను ఆదుకుంటాం: సీఎం హిమంత 

వర్షనష్టంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించారు. వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న జోర్హాట్, శివసాగర్, గోలాఘాట్, చరాయిదేవ్ జిల్లాల్లో ఆదివారం నుంచి ఈ నెల 30 వరకు ప్రభుత్వం ఇంటింటికీ వెళ్లి వరద నష్టాన్ని అంచనా వేస్తుందని తెలిపారు. బాధిత కుటుంబాలలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని, నిబంధనల ప్రకారం ప్రభుత్వం సహాయాన్ని అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ 10 నాటికి పునరావాస పనులకు అవసరమైన నిధుల అంచనాను ప్రభుత్వం సిద్ధం చేస్తుందని.. నిధుల అంచనా అందిన తర్వాత, శాశ్వత పునరావాసం కోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.