- పరిష్కారాలు కూడా వెతకండి యువతకు ప్రధాని మోదీ పిలుపు
- వికసిత భారత్ సాధనలో యువతే కీలకం
- ప్రతి తరానికీ ఒక జాతీయ బాధ్యత ఉంటుంది
- యువత తమ లక్ష్యాల్లో దేశ అభివృద్ధిని కూడా భాగం చేసుకోవాలని సూచన
- ఐఐటీ ఢిల్లీ 57వ కాన్వొకేషన్‌లో ప్రధాని ప్రసంగం
న్యూఢిల్లీ: ప్రపంచం ఎలాంటి ఆలోచన లేకుండా ఆమోదించే విషయాలను ధైర్యంగా ప్రశ్నించాలని యువత, విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. కేవలం ప్రశ్నలు అడగడంతోనే ఆగిపోకుండా, సమస్యలకు పరిష్కారాలను కూడా వెతకాలని పిలుపునిచ్చారు. శనివారం ఢిల్లీ ఐఐటీ 57వ స్నాతకోత్సవంలో గ్రాడ్యుయేట్ స్టూడెంట్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కొత్త పరిష్కారాలను కనుగొనే ధైర్యం ఉన్నవారికి సవాళ్లే అవకాశాలుగా మారుతాయని చెప్పారు. జీవితంలో జిజ్ఞాసను ఎప్పుడూ సజీవంగా ఉంచుకోవాలని, నేర్చుకునే తత్త్వాన్ని ఎప్పటికీ కోల్పోవద్దన్నారు. ‘‘టెక్నాలజీ మార్పులతో ప్రపంచం వేగంగా మారుతోంది.
అపూర్వమైన సవాళ్లతోపాటే విస్తృతమైన కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఈ వేగవంతమైన మార్పులన్నింటి మధ్య నా మాటను గుర్తుంచుకోండి. నిరంతరం నేర్చుకునేవాడే విజయం సాధిస్తాడు” అని ప్రధాని చెప్పారు. యువత ఎంతగా సాధికారత సాధిస్తే, దేశం అంతగా సాధికారత సాధిస్తుందన్నారు. డిగ్రీ పట్టాలు కేవలం విద్యాపరమైన విజయాలకంటే ఎంతో ఎక్కువని, దేశానికి తోడ్పడేందుకు లభించిన ఒక బాధ్యతగా పనిచేస్తాయని చెప్పారు. ‘‘అత్యంత కఠినమైన సమస్యలను ఎలా పరిష్కరించాలో మీకు బాగా తెలుసని మీ డిగ్రీ ప్రపంచానికి చెబుతోంది’’ అని మోదీ అన్నారు. చదువుతో పాటు అన్ని రంగాలలోనూ మహిళలు మరింత చురుగ్గా పాల్గొనేలా చూడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ వేడుకలో పతకాలు సాధించిన వారిలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉండటాన్ని ప్రస్తావించారు. పతకాలు గెలుచుకున్న విద్యార్థుల జాబితాలో ఇంకా ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటే బాగుండేదని మోదీ అభిప్రాయపడ్డారు.
యువతదే కీలక పాత్ర
యువత శక్తిసామర్థ్యాలపై ప్రధాని మోదీ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశాన్ని వికసిత భారత్ దిశగా నడిపించడంలో యువత పాత్ర ఎంతో కీలకమన్నారు. ‘‘మాకు మీపై పూర్తి నమ్మకం ఉంది. దేశానికి మీ సేవలు ఎంతో అవసరం” అని పేర్కొన్నారు. ప్రతి తరానికి ఒక జాతీయ బాధ్యత ఉంటుందని, యువత తమ లక్ష్యాలలో దేశ సర్వతోముఖాభివృద్ధిని కూడా భాగం చేసుకోవాలని సూచించారు. ‘‘ప్రతి కాలానికి తగినట్లుగా కొన్ని సవాళ్లు, జాతీయ బాధ్యతలు ఉంటాయి. రాబోయే 30 నుంచి 35 సంవత్సరాల పాటు మీరు చేసే ప్రతి పనీ వికసిత భారత్ ప్రయాణాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుకా దేశానికి దీనివల్ల ఎలాంటి లాభం చేకూరుతుంది? దేశ అవసరాలలో దేనిని ఇది తీరుస్తుంది? అనే ఆలోచన ఉండాలి’’ అని ఆయన హితవు పలికారు. జీతాలు, ప్లేస్‌మెంట్‌లు లేదా స్టార్టప్ మైలురాళ్లను తోటివారితో పోల్చడం మానుకోవాలని చెప్పారు.
స్వీయ-మెరుగుదలపై మాత్రమే దృష్టి సారిస్తూ, మానసిక, శారీరక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని సలహా ఇచ్చారు. ‘‘గుర్తుంచుకోండి. మీ అసలు రేస్ ఎవరితోనూ కాదు, మీతోనే’’ అని అన్నారు. ఈ స్నాతకోత్సవంలో 587 మంది పీహెచ్‌డీ స్కాలర్లతో పాటు 3 వేల మందికిపైగా గ్రాడ్యుయేటింగ్ విద్యార్థులకు యూనివర్సిటీ డిగ్రీలను ప్రదానం చేసింది. కాగా, ఢిల్లీ ఐఐటీ సోనిపట్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఏఐ- ఆధారిత హై-పెర్ఫార్మెన్స్ సూపర్‌కంప్యూటర్ ‘పరమ్ ప్రజ్ఞ’ను కూడా ప్రధాని ప్రారంభించారు.
