- నేడు సర్టిఫికెట్లకు విలువ లేదు..
- వాటితో జాబ్స్ రావట్లే: రాహుల్ గాంధీ
- ఉత్పత్తి రంగం కుదేలైంది.. ఉపాధి కరువైపోయింది
- యువత చీకటిలో చిరుదీపం వెలిగించింది
- భారత యువతకు సాటిలేదు.. 40 కోట్ల యువతే దేశానికి బలం
- ప్రేమ, ఆప్యాయతతో వ్యవస్థను మారుస్తాం
- ప్రయాగ్‌రాజ్‌లో ‘ఛాత్రోం కీ గూంజ్’ ప్రోగ్రాంలో ప్రతిపక్ష నేత స్పీచ్
ప్రయాగ్‌రాజ్: దేశంలో నిరుద్యోగం, పేపర్ లీక్ వంటి సమస్యలతోపాటు ఉపాధి సంక్షోభం నెలకొందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం క్షీణత, రుణాలు పొందడంలో ఇబ్బందులు, పరీక్షా పత్రాల లీకేజీలు, కృత్రిమ మేధ కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం వంటివి యువత ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు అని పేర్కొన్నారు. అయితే, భారత యువతకు సాటిలేదని, వారి సామర్థ్యానికి ప్రపంచంలో ఎవరూ సరితూగలేరని చెప్పారు. మన దేశానికి 40 కోట్ల మంది యువతే అతిపెద్ద బలమన్నారు. అమెరికా, చైనా, రష్యా గురించి ఎంతో మాట్లాడినప్పటికీ.. భారత యువతకు మాత్రం సాటిలేదన్నారు. శనివారం యూపీ ప్రయాగ్‌రాజ్‌లోని కేపీ గ్రౌండ్‌లో జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. ‘‘ఈ సాయంత్రం నేను మీతో దర్ద్ (వేదన), డేటా, దౌలత్ (సంపద) గురించి మాట్లాడాలనుకుంటున్నాను’’ అని ఆయన తెలిపారు.
దేశంలో నిరుద్యోగం, పరీక్షా పత్రాల లీకేజీలు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం సంక్షోభం, ఉపాధిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రభావం గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో విద్యార్హతల విలువ రోజురోజుకూ పడిపోతోందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘నేడు భారతదేశంలో విద్యా సర్టిఫికెట్లకు ఎలాంటి అర్థం లేదు. ఎందుకంటే అవి మీకు ఉద్యోగం ఇవ్వలేవు’’ అని చెప్పారు. దేశంలో ఉపాధికి సంబంధించిన అన్ని తలుపులూ మూసుకుపోయాయని రాహుల్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన విద్యార్థి నిరసనలను ఆయన ప్రస్తావించారు. యువత బెదిరింపులను ఎదుర్కొని చీకటిలో ఒక చిరుదీపం వెలిగించారని.. ఆ ప్రక్రియ ద్వారా మార్పు తీసుకురావడానికి సహాయపడ్డారని అన్నారు. ‘‘మేం ఎప్పటికీ ద్వేషాన్ని లేదా హింసను ఆశ్రయించం. ప్రేమ, ఆప్యాయతతో వ్యవస్థను మారుస్తాం” అని పేర్కొన్నారు. యువత కూడా అదే మార్గాన్ని అనుసరించాలని కోరారు.
పెల్లెట్ గన్లు కాదు.. జాబ్స్ కావాలి..
విద్య, నిరుద్యోగం, రిక్రూట్‌మెంట్ పరీక్షల సమస్యలపై విద్యార్థులతో సమావేశం కోసం ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన రాహుల్ గాంధీకి పెద్ద ఎత్తున హోర్డింగులు, ఫ్లెక్సీలతో స్వాగతం లభించింది. సభా వేదిక చుట్టూ ఉద్యోగాలు, విద్య, జవాబుదారీతనం వంటి అంశాలను హైలైట్ చేస్తూ, రాహుల్ గాంధీ ఫొటోలతో కూడిన పోస్టర్లను ఏర్పాటు చేశారు. ‘మాకు పెల్లెట్ గన్లు కాదు, ఉద్యోగాలు కావాలి’, ‘మంత్రి గారికి పెద్ద కారు, దేశ యువత నిరుద్యోగి’, ‘ఉద్యోగం లభించకపోతే సింహాసనం కదులుతుంది’ అంటూ రాహుల్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీల్లో రాశారు. రాహుల్ ‘జన నాయక్’ అని కొన్ని పోస్టర్లలో ప్రశంసించారు. కాగా, సభా ప్రాంగణంలో వర్షపు నీరు నిలిచిపోయినప్పటికీ, బురదగా ఉన్నప్పటికీ భారీ సంఖ్యలో విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ రాకకు ముందు ముంబైకి చెందిన రాపర్లు నృత్య ప్రదర్శనలు చేశారు. హాస్టల్ సౌకర్యాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన సమస్యలను ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు లేవనెత్తారు.
