డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కొట్లాట.. పోలీస్ స్టేషన్‌కు చేరిన సుమలత వర్సెస్ రఘు మాస్టర్ పంచాయితీ!

డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కొట్లాట.. పోలీస్ స్టేషన్‌కు చేరిన సుమలత వర్సెస్ రఘు మాస్టర్ పంచాయితీ!

టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో అంతర్గత వర్గ విభేదాలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. హైదరాబాద్ లోని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫీస్  ప్రాంగణంలోనే ఇరు వర్గాల డ్యాన్సర్లు పరస్పరం ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసోసియేషన్ 'మినిట్స్ బుక్' దక్కించుకునే క్రమంలో ప్రస్తుత అధ్యక్షురాలు, జానీ మాస్టర్ భార్య సుమలత, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. 

ఈ గొడవ ముదిరి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. అసోసియేషన్ కు సంబంధం లేని వ్యక్తులు కుట్రతో తమపై దాడి చేశారని సుమలత ఆరోపించింది. సుమలత మనుషులే తమపై దాడి చేశారంటూ రఘ మాస్టర్ వర్గం పేర్కొంది. ఈ ఘటనపై ఇరువర్గాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుమలత తీరుపై ఆగ్రహంతో ఉన్న కొందరు తోటి డ్యాన్సర్లు ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అసలు ఈ గొడవకు కారణం.. అంతకుముందు తెలుగు ఫిలిం ఫెడరేషన్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం.. డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో నెలకొన్న సమస్యలను తేల్చేందుకు ఫెడరేషన్ పెద్దలు సుమలత, రఘు మాస్టర్ సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మొత్తం 225 మంది సినీ డ్యాన్సర్లు హాజరైన ఈ మీటింగ్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా అభిప్రాయ సేకరణ జరిపారు.

ఈ ఓటింగ్‌లో ఏకంగా 214 మంది డ్యాన్సర్లు రఘు మాస్టర్‌కే మద్దతు తెలపగా.. సుమలత వైపు కేవలం 11 మంది మాత్రమే నిలిచారు. దీంతో మెజారిటీ నిర్ణయం మేరకు సుమలత నేతృత్వంలోని కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు ఫెడరేషన్ ప్రకటించింది. అంతేకాకుండా, అక్టోబర్ 11న అసోసియేషన్ నూతన ఎన్నికలు నిర్వహిస్తామని షెడ్యూల్ విడుదల చేసింది.

ఫెడరేషన్ తీసుకున్న ఈ ఊహించని షాకింగ్ నిర్ణయం, ఎన్నికల షెడ్యూల్‌తో డ్యాన్సర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏకంగా ఫిల్మ్ ఛాంబర్‌లోనే దాడికి పాల్పడేంతగా వివాదం చెలరేగడంతో అక్టోబర్ 11న జరగబోయే ఎన్నికలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయోనని ఇండస్ట్రీ వర్గాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి.