Nani Court Order: ‘ది ప్యారడైజ్’ కోర్టు ఆర్డర్‌పై నాని క్లారిటీ.. నెగటివ్ రివ్యూలు ఇస్తే జైలుకేనా?

Nani Court Order: ‘ది ప్యారడైజ్’ కోర్టు ఆర్డర్‌పై నాని క్లారిటీ.. నెగటివ్ రివ్యూలు ఇస్తే జైలుకేనా?

‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందే కోర్టు ఆంక్షల అంశం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టులు, కామెంట్లు, యూఆర్ఎల్స్‌పై బెంగళూరు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో.. ఇక సినిమా రివ్యూలపై కూడా ఆంక్షలు ఉంటాయా? నెగటివ్ రివ్యూలు రాస్తే జైలుకేనా?..అనే చర్చ మొదలైంది. తాజాగా ఈ విషయంపై నాని క్లారిటీ ఇచ్చారు. కోర్టు ఆర్డర్ నిజమైన రివ్యూలను, ప్రేక్షకుల అభిప్రాయాలను టార్గెట్ చేయదని తెలిపారు.

కోర్టు ఆర్డర్‌పై నాని క్లారిటీ..

ఇవాళ ముంబైలో ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నానిని కోర్టు ఆర్డర్‌పై ప్రశ్నించగా.. “ఇది జెన్యూన్ రివ్యూలను టార్గెట్ చేయదు” అని స్పష్టం చేశారు. తనకు తెలిసినంతవరకు కోర్టు ఆర్డర్ ప్రధానంగా AI, బాట్‌ల ద్వారా రూపొందుతున్న లేదా కావాలనే ప్రచారం చేస్తున్న కంటెంట్‌కు సంబంధించినదని తెలిపారు. 

అంటే.. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు తమకు నచ్చిందా? నచ్చలేదా? అనే విషయాన్ని స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు. రివ్యూలు రాయొచ్చు, సినిమాపై విమర్శలు చేయొచ్చు. కోర్టు ఆర్డర్ ప్రధానంగా తప్పుడు, పరువు నష్టం కలిగించేలా ఉన్నట్లు నిర్మాతలు పేర్కొన్న నిర్దిష్ట ఆన్‌లైన్ కంటెంట్‌ను అడ్డుకోవడానికే సంబంధించినదని అని తెలిపారు.

అసలు వివాదం ఏంటి?

ఆగస్టు 6న టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి కొందరు కావాలనే సోషల్ మీడియాలో నెగెటివ్ కంటెంట్ ప్రచారం చేస్తున్నారని నిర్మాతలు గుర్తించారు. అలా సినిమాపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని పోస్టులు, కామెంట్లు, యూఆర్ఎల్స్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి బెంగళూరులోని సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సినిమాలో పెట్టుబడులు, ప్రమోషన్స్, డిస్ట్రిబ్యూషన్‌పై ప్రభావం పడేలా కొన్ని కంటెంట్‌లు ఉన్నాయని నిర్మాతలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సెప్టెంబర్ 19న అదనపు సిటీ సివిల్ అండ్ సెషన్స్ జడ్జి ఈ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. గుర్తించిన కొన్ని కంటెంట్‌లు, యూఆర్ఎల్స్‌ను హోస్ట్ చేయడం, ప్రచురించడం, ట్రాన్స్‌మిట్ చేయడం లేదా మళ్లీ అందుబాటులోకి తీసుకురావడంపై కోర్టు ఆంక్షలు విధించింది.

రివ్యూలకు, ఆంక్షలకు సంబంధం ఏంటి?

కోర్టు ఆర్డర్ బయటకొచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ‘ది ప్యారడైజ్ రివ్యూలను కూడా నియంత్రిస్తున్నారా?’ అనే చర్చ మొదలైంది. అయితే నాని తాజా వ్యాఖ్యలతో ఈ విషయంలో స్పష్టత వచ్చినట్టైంది.

సినిమాను చూసి నిజాయితీగా రాసే రివ్యూ ఒకటి.. ముందుగానే ఉద్దేశపూర్వకంగా తప్పుడు కంటెంట్‌ను సృష్టించి వైరల్ చేయడం మరోటి అనే తేడాను ఈ వ్యవహారం ద్వారా గమనించాల్సి ఉంది. నిర్మాతలు కోర్టులో సవాల్ చేసిన నిర్దిష్ట కంటెంట్‌పైనే ప్రస్తుత ఆంక్షలు వర్తిస్తాయి. ప్రతి నెగెటివ్ కామెంట్ లేదా ప్రతి విమర్శను ఆపేలా ఈ ఉత్తర్వులు ఉండవు. 

సెప్టెంబర్ 24న థియేటర్లలోకి..

నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి కలిసి వస్తుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో మోహన్ బాబు, కాయదు లోహర్, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక కోర్టు వ్యవహారం, నాని తాజా వివరణ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి సినిమా విడుదల తర్వాత వచ్చే అసలు ప్రేక్షకుల రియాక్షన్స్ పైనే ఉంది.