ఎక్స్‌పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. అన్నోజీగూడలో తయారీ యూనిట్ గుట్టురట్టు

ఎక్స్‌పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. అన్నోజీగూడలో తయారీ యూనిట్ గుట్టురట్టు


మేడ్చల్ జిల్లా: గడువు ముగిసిన మసాలా ఉత్పత్తులపై కొత్త తేదీలు ముద్రించి తిరిగి విక్రయాలకు సిద్ధం చేస్తున్న తయారీ యూనిట్‌పై ఉప్పల్ జోన్ ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్నోజీగూడలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. అన్నోజీగూడలోని దిల్ బహార్ తయారీ యూనిట్‌లో గడువు ముగిసిన మసాలా ఉత్పత్తుల ప్యాకెట్లపై ఉన్న అసలు తయారీ, గడువు తేదీలను తెల్లటి స్టిక్కర్లతో కప్పి, వాటిపై కొత్త తేదీలను ముద్రిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం ప్యాకెట్లను తిరిగి సీల్ చేసి మార్కెట్‌లో విక్రయించేందుకు సిద్ధం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తనిఖీల్లో మటన్ బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, మీట్ మసాలా, సబ్జీ మసాలా, డ్రై మ్యాంగో పౌడర్, టీ పౌడర్ తదితర ఉత్పత్తులను పోలీసులు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి యూనిట్ మేనేజర్ షేక్ జహంగీర్, యజమాని షేక్ మహ్మద్ నబీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకుతో పాటు వారిని పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు అప్పగించారు.

ఈ వ్యవహారంపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల తేదీలను మార్చి విక్రయించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై తదుపరి విచారణ కొనసాగుతోంది.