- ఏడుగురు సభ్యుల రాజస్తాన్ ముఠా అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: రాజస్తాన్ నుంచి మెఫిడ్రిన్, ఓపియం (నల్లమందు) సప్లయ్ చేస్తున్న ముఠాలపై ఈగల్ ఫోర్స్ నజర్ పెట్టింది. హైవేలపై ఉన్న రాజస్తాన్ దాబాలను కేంద్రంగా చేసుకుని నల్లమందు, మెఫిడ్రిన్ సప్లయ్ చేస్తున్న రాజస్తాన్‌కు చెందిన ఏడుగురు సభ్యుల ముఠాను శుక్రవారం అరెస్ట్ చేసింది. నిందితుల వద్ద 25 గ్రాముల మెఫిడ్రిన్ (ఎండీ), 1.031 కిలోల నల్లమందు స్వాధీనం చేసుకుంది. ఇందుకోసం మియాపూర్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత 20 రోజులుగా నిఘా పెట్టింది. స్వాధీనం చేసుకున్న మత్తుపదార్థాల విలువ రూ.12.65లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా శనివారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.
బస్సులు, రైళ్లు, కార్లలో నల్లమందు రవాణా
నల్లమందు, మెఫిడ్రిన్‌ను రాజస్తాన్ నుంచి ప్రైవేట్ బస్సులు, రైళ్లు, ఇతర వాహనాల ద్వారా తెలంగాణకు తరలిస్తున్నారు. రాజస్తాన్‌కు చెందిన యువతను కొరియర్లు, డెలివరీ ఏజెంట్లుగా వినియోగిస్తూ.. హైదరాబాద్‌లో స్థానిక పెడ్లింగ్ నెట్‌వర్క్‌ల ద్వారా దాబాలకు సప్లయ్ చేస్తున్నారు. మొబైల్ ఫోన్లు, డిజిటల్, యూపీఐ చెల్లింపుల ద్వారా నగదు లావాదేవీలు జరుపుతున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఈగల్ ఫోర్స్ సిబ్బంది మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక పోలీసులతో కలిసి శుక్రవారం జాయింట్ ఆపరేషన్ నిర్వహించి రాజస్తాన్ నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హపీజ్‌పేట ప్రాంతంలో సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండీ డ్రగ్‌ను కస్టమర్లకు ఇచ్చేందుకు వచ్చిన మరో నలుగురిని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఇలా 20 రోజుల వ్యవధిలోనే ఏడుగురు సభ్యుల రాజస్తాన్ డ్రగ్ నెట్‌వర్క్‌ను అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు.
