- 480 ఫ్లాట్స్‌కు అత్యధికంగా 5 వేల దరఖాస్తులు
- ఖైరతాబాద్‌లో 4 వేల అప్లికేషన్లు
- మహేశ్వరంలో అత్యల్పంగా 471
- మొత్తంగా 16 నియోజకవర్గాలకు 35,125 అప్లికేషన్లు
- రేపటితో ముగియనున్న గడువు
- ఈ నెల 20 తర్వాత లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక
హైదరాబాద్, వెలుగు: క్యూర్ పరిధిలో ప్రభుత్వం నిర్మించనున్న ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు భారీ స్పందన వస్తున్నది. ఫ్లాట్ల కోసం ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ఈ పథకం కింద మొత్తం లక్ష ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి నియోజకవర్గంలోనూ 500 ఇండ్ల చొప్పున నిర్మాణాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న 7,340 ఇండ్ల కోసం డిమాండ్ సర్వే ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కాగా, శనివారం వరకు అత్యధికంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో 480 ఫ్లాట్లకు 5,233 అప్లికేషన్లు వచ్చాయి. ఆ తర్వాత ఖైరతాబాద్ నియోజకవర్గంలో 4,394 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా, సోమవారంతో అప్లికేషన్ గడువు ముగియనుంది. ఇప్పటి వరకూ 16 నియోజకవర్గాలకు 35,125 అప్లికేషన్లు రాగా, మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో మరో 5 వేలు వచ్చే అవకాశం ఉందని హౌసింగ్ బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు.
20వ తేదీ తర్వాత లాటరీ: వీపీ గౌతం
క్యూర్ ఫ్లాట్ల కోసం ఈ నెల 20 తర్వాత లాటరీ తీసి, లబ్ధిదారులను ఎంపిక చేస్తామని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం వెల్లడించారు. ప్రభుత్వ రూల్స్‌కు అనుగుణంగా అప్లికేషన్లను పరిశీలిస్తామని చెప్పారు. ఓవైపు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తూనే.. మరోవైపు ఇండ్ల కేటాయింపు, నిర్మాణాలకు సంబంధించిన కార్యాచరణపై కూడా హౌసింగ్ బోర్డు చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియను ఈ నెల 20 వ తేదీ నుంచి చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు చెప్పారు.
అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణ పనులను చేపట్టడానికి టెండర్ ప్రక్రియను కూడా చేపట్టామన్నారు. ఈ ఇండ్లన్నింటినీ ఏడాదిలోపే పూర్తి చేసి, లబ్ధిదారులకు అందించేలా పకడ్బందీ ప్రణాళికను అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంతో విలువైన భూముల్లో నిర్మిస్తున్న ఈ ఇండ్లను కేవలం నామమాత్రపు ధరకే అందిస్తున్నట్టు చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో రూ. 30 లక్షల నుంచి రూ. 58 లక్షల ధర పలికే ఈ ఫ్లాట్లను ప్రజల సంక్షేమం కోసం వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచాలన్న ఉద్దేశంతో కేవలం రూ. 6 లక్షలకే ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. ఇండ్లు కేటాయించని పక్షంలో దరఖాస్తుదారులు చెల్లించిన ధరావతు ఫీజు రూ.10 వేలను తిరిగి చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా 040–-24603572 ద్వారా సంప్రదించవచ్చని గౌతం తెలిపారు.
అధికారంలోకి వస్తే ఫ్రీగా ఇండ్లిస్తామని బీఆర్ఎస్ నేతల ప్రచారం..
క్యూర్ పరిధిలో ప్రభుత్వం చేపట్టనున్న టవర్లకు కొన్ని నియోజకవర్గాల్లో చాలా తక్కువ అప్లికేషన్లు వచ్చాయి. ఇందుకు బీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. “ మా ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఫ్రీగా ఇచ్చాం. ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఇపుడు ఒక్కో ఫ్లాట్‌కు రూ. 6 లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ ఫ్లాట్లకు అప్లై చేయకండి. మేం అధికారంలోకి వస్తే ఫ్రీగా ఇస్తాం” అని ప్రచారం చేసినట్టు తెలుస్తున్నది. దీంతో మహేశ్వరం నియోజకవర్గంలో 480 ఫ్లాట్లకు 471 అప్లికేషన్లు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 749, మల్కాజ్‌గిరిలో 1,033, మేడ్చల్‌లో 1,153, సనత్‌నగర్‌లో 1,046 మాత్రమే అప్లికేషన్లు వచ్చాయి.
