హైదరాబాద్లో హోటల్స్ బంద్పై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ క్లారిటీ

హైదరాబాద్లో హోటల్స్ బంద్పై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ క్లారిటీ

ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్యాస్ కొరతతో ఇండియాలోని పలు మెట్రో నగరాల్లో హోటల్స్ తాత్కాలికంగా మూతపడుతున్నాయి. ఇప్పటికే బెంగళూర్ లో హోటల్స్ మూతపడ్డాయి. చెన్నైలో మూసివేస్తున్నట్లు అక్కడి హోటల్స్ అసోసియేషన్స్ ప్రకటించాయి. కమర్షియల్ సిలిండర్ల కొరత తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది. ఇప్పటికే విశాఖలో హోటల్స్ మూసివేత ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో హోటల్స్ నిర్వహణపై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం (మార్చి 10) మీడియాతో మాట్లాడారు. 

తెలంగాణలో హోటల్స్, రెస్టారెంట్ లకు గ్యాస్ సరఫరా ఆగిపోయిందని  హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి తెలిపారు. గత వారం రోజులుగా కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచారని చెప్పారు. గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని.. ఇక నుంచి గ్యాస్ సరఫరా కష్టమేనని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారని తెలిపారు. 

మనిషికి ఆక్సిజన్ ఎలాగో... హోటల్స్ కి గ్యాస్ అంత ఇంపార్టెంట్ అని అన్నారు. గ్యాస్ సరఫరా లేకుంటే హోటల్ ఇండస్ట్రీ పై ఆధారపడి బతికే వాళ్ళంతా రోడ్డున పడుతారని ఆవేదన వ్యక్తం చేశారు. హోటల్స్ బంద్ పై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెంకట్ రెడ్డి తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి గ్యాస్ నిల్వ కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.