యుద్ధం మధ్య కూడా బంగారం ధరలు అనూహ్యంగా తగ్గడం మదుపర్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో గోల్డ్ ధరలు ఆకాశాన్ని తాకుతాయని భావించినా.. మార్కెట్‌లో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర సుమారు 4 శాతం తగ్గి ఔన్స్‌కు 5166 డాలర్ల వద్దకు చేరుకోగా, వెండి ధర కూడా ఇదే బాటలో పయనిస్తోంది. భారతీయ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షా 61వేల కిందకు జారిపోగా, వెండి కేజీ రూ.2లక్షల 77వేల వద్ద ట్రేడవుతోంది. గత 11 రోజులుగా ఈ లోహాలు బలహీనంగానే ట్రేడింగ్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
ధరలు తగ్గడానికి అసలు కారణాలు ఇవే..
యుద్ధం సమయంలో బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఇంధన ధరలు పెరగడంతో అమెరికన్ డాలర్ మరింత బలపడటం. అంతర్జాతీయ ఉద్రిక్తతల వేళ సురక్షితమైన పెట్టుబడిగా ఇన్వెస్టర్లు బంగారం కంటే డాలర్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. రెండవది స్టాక్ మార్కెట్లలో భారీ పతనం వల్ల ఇన్వెస్టర్లు తాము కోల్పోయిన మార్జిన్లను భర్తీ చేయడానికి తమ వద్ద ఉన్న బంగారం, వెండి పెట్టుబడులను అమ్ముకుంటున్నారు. దీనివల్ల మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు స్వల్పకాలికంగా తగ్గుతున్నాయి.
2026 చివరి నాటికి బంగారం పరిస్థితి ఏంటి?
ప్రస్తుతం ధరలు తగ్గినప్పటికీ.. దీర్ఘకాలంలో బంగారం 'బుల్ మార్కెట్'లో ఉందని నిపుణులు చెబుతున్నారు. 2026 చివరి నాటికి బంగారం ధర ఔన్స్‌కు 5,500 డాలర్ల నుండి 6,000 డాలర్ల మధ్యకు చేరుకోవచ్చని అగ్మంట్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ రెనీషా చైనానీ అన్నారు. అలాగే భారత్‌లో కూడా ధరలు సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు తమ వద్ద ఉన్న బంగారం నిల్వలను పెంచుకోవడం, పెరుగుతున్న రుణ భారాలు, నవంబర్‌లో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికలు వంటి అంశాలు బంగారం రేట్లకు ఊతమిస్తున్నాయి.
►ALSO READ | యుద్ధం ముగించాలంటూ ట్రంప్‌కు సలహాదారుల హెచ్చరిక.. క్రూడ్ కోలుకోవటానికి 2 ఏళ్లు..
ఇప్పుడు కనిపిస్తున్న ధరల పతనం కేవలం తాత్కాలికమేనని కోటక్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ సతీష్ దొండపాటి అభిప్రాయ పడుతున్నారు. ప్రపంచ దేశాలు డాలర్‌పై ఆధారపడటం తగ్గించి బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. కాబట్టి ధరలు తగ్గిన ప్రతిసారి ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టడానికి ఒక మంచి అవకాశంగా భావించాలన్నారు. మార్కెట్ ఒడిదుడుకులు తగ్గిన వెంటనే బంగారం మళ్లీ పుంజుకుంటుందని అన్నారు. 2026 సెకండ్ హాఫ్ లో గోల్డ్ రేట్లు సరికొత్త గరిష్టాలను తాకడం ఖాయమని మార్కెట్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. చూడాలి నిజంగా రేట్లు ఆ స్థాయిలో పెరుగుతాయా లేదా అన్నది.
