
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్, క్లీనర్.. తమ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్లను ఘరానా మోసం చేసి పరారయ్యారు. ఫుడ్ కోసమని హోటల్ దగ్గర బస్సు ఆపి, ప్రయాణికులంతా దిగగానే.. వాళ్ల లగేజీలతో ఉడాయించారు. వాళ్లందరినీ అక్కడే వదిలేసి బస్సు తీసుకుని పరారయ్యారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద నిన్న రాత్రి జరిగింది.
అస్సాంకు చెందిన వలస కూలీలు కేరళ నుంచి తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బుక్ చేసుకున్నారు. కేరళలోని ఎర్నాకుళంలో ఓ ఏజెంట్ సాయంతో బుక్ చేసుకున్న ఆ బస్సులో మొత్తం 64 మంది కూలీలు బుధవారం నాడు బయలుదేరారు. ఆదివారానికి వాళ్లంతా తమ స్వస్థలానికి చేరాల్సి ఉంది. అయితే శుక్రవారం రాత్రి నల్లగొండలోని నార్కెట్‌పల్లి వద్దకు రాగా.. ఓ హోటల్ వద్ద భోజనానికి అని బస్సు నిలిపారు. ఇంతలో బస్సులో రిపేర్ వచ్చిందని, చేయించుకుని వస్తానంటూ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కూలీలకు పోలీసులు భోజన వసతి కల్పించారు. వారికి ఫంక్షన్ హాల్ లో బస ఏర్పాటు చేసినట్లు సీఐ శంకర్ రెడ్డి చెప్పారు. ఆ బస్సు కోసం గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు.