ఆస్పత్రి బిల్లు వెయ్యి దాటితే మేమే కడతాం: ఏపీ సీఎం

ఆస్పత్రి బిల్లు వెయ్యి దాటితే మేమే కడతాం: ఏపీ సీఎం

    ఆపరేషన్ తర్వాత కోలుకునే వరకు రూ.5 వేల సాయం

    150 మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ:  ఏపీ సీఎం జగన్

ఆసుపత్రుల్లో బిల్లు వెయ్యి రూపాయలు దాటితే ప్రభుత్వమే చెల్లిస్తుందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకుంటే మందులతో సహా అన్నీ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ స్కీమ్ కింద ఆపరేషన్లు చేయించుకున్నవారు కోలుకునే వరకు నెలకు రూ.5 వేల పెన్షన్ ఇస్తామని చెప్పారు. పెద్ద ఆపరేషన్లు అయితే రోజుకు రూ. 225 చెల్లిస్తామన్నారు. డిసెంబర్ 1 నుంచి ప్రారంభించే ఈ పెన్షన్ స్కీంను రోగులు కోలుకునే వరకు కొనసాగిస్తామని చెప్పారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో సర్కారు గుర్తించిన 150 మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నవారికి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్నారు. శుక్రవారం అమరావతిలో వైద్య, ఆరోగ్య శాఖపై ఆయన సమీక్షించారు. జనవరిలో వైద్య శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు. 500కు పైగా కొత్త 108, 104 వాహనాల కొనుగోలు చేస్తామని చెప్పారు.

కిడ్నీ, తలసేమియా, హీమోఫీలియా, సికిల్‌‌సెల్‌‌ ఎనిమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని ఆదేశించారు. రూ. 5 వేల పెన్షన్ కేటగిరీలో మరో 4 వ్యాధులను చేరుస్తామన్నారు. పక్షవాతంతో వీల్‌‌చైర్‌‌కు పరిమితమైనవారికి, కాళ్లు-చేతులు పనిచేయలేని స్థితిలో ఉన్నవారికి, కండరాల క్షీణతతో పనిచేయలేని స్థితిలో ఉన్నవారికి జనవరి 1 నుంచి రూ. 5 వేల పెన్షన్ అందిస్తామని ప్రకటించారు. జనవరి 1 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2 వేల వ్యాధులకు, మిగతా జిల్లాల్లో 1,200 వ్యాధులకు  ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందించేలా పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తామన్నారు. ఆరోగ్య శ్రీలో డెంగీ లాంటి సీజనల్ వ్యాధులకు చోటు కల్పిస్తామని చెప్పారు. డిసెంబర్‌‌ 21 నుంచి ఆరోగ్య కార్డుల జారీ చేస్తామన్నారు. ఆసుపత్రుల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్లకు రూ. 16 వేలు జీతం ఇచ్చేలా జీవో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.