మన ఇంట్లో ఎన్ని గదులున్నా, అందరికీ ఇష్టమైన... నిత్యం కళకళలాడే ఏకైక ప్రదేశం ఏది అంటే వంటగది అనే చెబుతాం. ఎందుకంటే, అక్కడ నుంచే మన పొట్ట నింపే కమ్మని వంటకాలు వస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా వంటగది కేవలం ఆహారం వండుకునే చోటు మాత్రమే కాదు... మన ఆరోగ్యం, ఐశ్వర్యం, అదృష్టాన్ని నిర్ణయించే ఒక పవిత్రమైన స్థలం. మన పెద్దలు వంటగదిని సాక్షాత్తూ ఆ అన్నపూర్ణాదేవి కొలువైన స్థానంగా భావిస్తారు. అందుకే కిచెన్‌ను ఎప్పుడూ నీట్‌గా ఉంచుకోవాలని చెబుతుంటారు.
అయితే, చాలామంది ఇళ్లలో చిన్న పొరపాటు జరుగుతుంటుంది. కాస్త అంచు పగిలిన కప్పులు, బీటలు వారిన ప్లేట్లు, లేదా గీతలు పడిన గిన్నెలను "ఏముందిలే, కొంచెమేగా విరిగింది" అని అలాగే వాడుతుంటారు. కానీ, వాస్తు ప్రకారం ఇలాంటి పగిలిన పాత్రల్లో తినడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రావడమే కాకుండా, లక్ష్మీదేవి అగ్రహానికి గురికావాల్సి వస్తుందట. మరి పగిలిన పాత్రలను వాడటం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు చూద్దాం...
1. దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు
వాస్తు శాస్త్రం ప్రకారం, పగిలిన పాత్రలలో భోజనం చేయడం లేదా వాటిలో వంట చేయడం వల్ల ఇంట్లోకి పేదరికం అడుగుపెడుతుంది. ఇలా చేయడం వల్ల అన్నపూర్ణా దేవికి కోపం వచ్చి, ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తగ్గుతుందని నమ్ముతారు. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవకపోవడం, అనవసర ఖర్చులు పెరగడం లాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
ALSO READ : కుటుంబ బాధ్యతలు మోసే నాన్న కోసం ఒక రోజు..
2. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ... ఎప్పుడూ గొడవలే
పగిలిన వస్తువులు లేదా పాత్రలు ఎప్పుడూ కూడా ప్రతికూల శక్తిని (Negative Energy) ఆకర్షిస్తాయి. అలాంటి పాత్రల్లో ఆహారం తిన్నప్పుడు, ఆ నెగిటివ్ ఎనర్జీ మన శరీరం, మనస్సుపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన చిరాకులు, చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు, మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది.
3. రాహు, శని దోషాల దుష్ప్రభావాలు
జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం... ఇంట్లో పగిలిన, మురికి పాత్రలను ఉంచడం వల్ల జాతకంలో రాహువు, శని గ్రహాల అశుభ ప్రభావం పెరుగుతుంది. దీనివల్ల మీరు చేసే పనులన్నీ మధ్యలోనే ఆగిపోవడం, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు రాకుండా ఆటంకాలు ఎదురవడం లాంటి సమస్యలు వస్తాయి. అందుకే, మీ కిచెన్‌లో అలాంటి పాత్రలు ఉంటే ఈరోజే వాటిని బయట పారేయండి.
మరి వంట పాత్రలను ఏ దిశలో ఉంచాలి
కేవలం మంచి పాత్రలు వాడటమే కాదు, వాటిని సరైన ప్లేస్‌లో పెట్టడం కూడా ముఖ్యం. వాస్తు ప్రకారం... వంటగదిలో పాత్రలను సర్దడానికి ఉత్తరం లేదా తూర్పు దిశలు అత్యంత శుభప్రదమైనవి. ఈ దిశలో పాత్రలను బోర్లించడం లేదా అమర్చడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యం, ఐశ్వర్యం రెండు బాగుండాలంటే... వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. విరిగిన, పగిలిన వస్తువులకు వెంటనే బై-బై చెప్పేయండి.
