
సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ప్రస్తుత క్రికెటర్ లో మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నాడు. ఈ సఫారీ కెప్టెన్ మీద సినిమా తీయాలే గానీ బవుమా మీద బయోపిక్ వస్తే బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. బవుమా క్రికెట్ కెరీర్ లోనే కాదు జీవితంలో లెక్కలేనన్ని ఎత్తు పల్లాలున్నాయి. అవమానాలు, విమర్శలు, ట్రోలింగ్స్, చిన్న చూపు చూడడం, తక్కువగా చేసి మాట్లాడడం, ఎత్తును కామెంట్ చేయడం, కలర్ పై జోక్ లు వేసుకోవడం లాంటి ఎన్నో బాధాకర సంఘటనలు బవుమా జీవితంలో ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానమిస్తూ తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు. తాను అసామాన్యుడు అని నిరూపించాడు.
సౌతాఫ్రికా క్రికెట్ లో ఐసీసీ ట్రోఫీ ఒక కల. 1998లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చినప్పటికీ వరల్డ్ టైటిల్ ఒక్కటి కూడా కొట్టలేకపోయింది. దిగ్గజ క్రికెటర్లు ఎంత ప్రయత్నించినా సౌతాఫ్రికాపై వరల్డ్ టైటిల్ అందని కలగానే మిగిలిపోయింది. అయితే బవుమా రాకతో సౌతాఫ్రికా జట్టు చాలా కొత్తగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిలో జట్టు కోసం ఏదైనా చేయాలనే కసి కనిపించింది. టెస్ట్ ఛాంపియన్స్ షిప్ ఫైనల్ కు వెళ్లినా అదృష్టవశాత్తు వెళ్లారని.. ఆస్ట్రేలియాపై చిత్తవడం గ్యారంటీ అనుకున్నారు. ఈ దశలో సౌతాఫ్రికా ఆశలను బవుమా నెరవేర్చగలడా అనే ప్రశ్నలకు చెక్ పెట్టి సఫారీలకు టెస్ట్ ఛాంపియన్స్ షిప్ టైటిల్ అందించాడు.
సౌతాఫ్రికా దేశం తనపై పెట్టుకున్న ఆశలను బవుమా తీర్చాడు. 27 ఏళ్ళ తర్వాత తమ దేశానికి ఐసీసీ టైటిల్ అందించాడు. అయితే టెంబా అనే పేరుకు ఆశ అర్ధం అని బవుమా చెప్పాడు. చిన్న వయసులో తన అమ్మమ్మ తనకు ఎందుకు టెంబా పేరు పెట్టిందో వివరించాడు. బవుమా మాట్లాడుతూ.. మా అమ్మమ్మ నాకు టెంబా అని పేరు పెట్టింది. ఈ పేరుకు అర్ధం ఆశ. జాతి, దేశం నాపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలని ఆ పేరు పెట్టారు. ఇంతకన్నా ఉత్తమమైన పేరు ఉంటుందా". అని బవుమా తెలిపాడు. సౌతాఫ్రికా ఆశలను నెరవేర్చడమే కాదు.. విమర్శించిన వారే ఇప్పుడు తలలు వంచుకుంటున్నారు. మరో 4 నుంచి 6 ఏళ్ళ పాటు బవుమా గురించి మాట్లాడకుండా చేశాడు.