15 కిమీ రైడ్‌కి రూ.15వందలు ఏంటి సామీ? తాము ATMలు కాదంటున్న బెంగళూరీలు

15 కిమీ రైడ్‌కి రూ.15వందలు ఏంటి సామీ? తాము ATMలు కాదంటున్న బెంగళూరీలు

బెంగళూరు అనగానే ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్ కష్టాలే. రోజూ గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి నానా తంటాలు పడే ఐటీ ఉద్యోగులు, ప్రయాణికులు సోషల్ మీడియాలో తమ గోడు వెళ్లబోసుకోవడం రెగ్యులర్. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ సేల్స్ డెవలప్‌మెంట్ మేనేజర్ చేసిన పోస్ట్ నెట్టింట పెద్ద చర్చకే తెరలేపింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. క్యాబ్ అప్లికేషన్స్ ‘లూట్ మోడ్’లోకి మారిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీస్‌కు వెళ్లే ప్రయాణికులు, విద్యార్థులు, వృద్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎత్తిచూపిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌ అయ్యింది.

సుభాష్ నాయర్ అనే ప్రొఫెషనల్ లింక్డిన్‌లో షేర్ చేసిన అనుభవం అనేక మందిని కదిలించింది. సాధారణ రోజుల్లో రూ.400 నుంచి రూ.500 ఉండే 25 కిలోమీటర్ల ప్రయాణం.. వర్షం పడిన వెంటనే ఏకంగా రూ.800 నుంచి రూ.1000కి చేరిపోతుందని మండిపడ్డారు. అత్యవసర సమయాల్లోనే ప్రయాణికుల బలహీనతను ఆసరాగా చేసుకుని సర్జ్ ప్రైసింగ్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. అంతేకాదు ముందుగా బుక్ చేసుకున్న రైడ్స్‌ను డ్రైవర్లు క్యాన్సిల్ చేయడం, కస్టమర్లతోనే క్యాన్సిల్ చేయమని చెబుతున్నారని ఆరోపించారు.

“ఆకాశం మేఘావృతమైన క్షణంలోనే బెంగళూరు క్యాబ్ యాప్స్ లూట్ మోడ్‌లోకి వెళ్తాయి. బెంగళూరు ప్రయాణికులు ఏటీఎం యంత్రాలు కారు” అంటూ సుభాష్ నాయర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. వర్షాలు, అత్యవసర సమయాల్లో డైనమిక్ ప్రైసింగ్‌పై కర్ణాటక ప్రభుత్వం, రవాణా శాఖ తగిన నియంత్రణలు తీసుకురావాలని.. అడ్డగోలు రైడ్ క్యాన్సిలేషన్లకు జరిమానాలు విధించాలని డిమాండ్ చేశారు.

ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు నెటిజన్లు తాము కూడా ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొన్నామని తెలిపారు. "శుక్రవారం ఈవెనింగ్ 15 కిమీ ప్రయాణానికి రూ.12వందల నుంచి 15వందలు కోట్ చేశారు. నేను బెంగళూరులో క్యాబ్ బుక్ చేస్తున్నానా? లేక బెంగళూరు నుంచి హైదరాబాద్ బస్ టికెట్ బుక్ చేస్తున్నానా అని సందేహం వచ్చింది" అంటూ యూజర్ ఫన్నీగా కామెంట్ చేశారు. పూణే సహా ఇతర నగరాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని మరికొందరు కామెంట్లు చేశారు. 

ALSO READ : నోబెల్ ఎటూ ఇవ్వలేదు.. కనీసం ఈ అవార్డ్ అయినా ఇవ్వండి

మరికొందరు మాత్రం దీన్ని మార్కెట్ డిమాండ్ సప్లై సూత్రంగా సమర్థిస్తున్నారు. డ్రైవర్లు వ్యాపారం చేసుకుంటున్నారని, దీనిని దోపిడీ అనలేమని కొందరు వాదించారు. మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను కోరాలి తప్ప ప్రైవేట్ క్యాబ్ ఆపరేటర్లను టార్గెట్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా బెంగళూరు క్యాబ్ సర్జ్ ప్రైసింగ్ మాత్రం ప్రజల జేబులను గుల్లచేస్తోందనే వాదన అందరినీ ఆలోచింపజేస్తోంది.