నల్ల రిబ్బన్లు, నల్ల జెండాలతో బీజేపీ నేతల నిరసన

నల్ల రిబ్బన్లు, నల్ల జెండాలతో  బీజేపీ నేతల నిరసన

తెలంగాణ విమోచన దినోత్సవం రోజును టీఆర్ఎస్ పార్టీ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఎల్బీ నగర్ లోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నల్ల రిబ్బన్ లు, నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని, జాతీయ సమైక్యతా దినోత్సవంగా టీఆర్ఎస్ నిర్వహించిందని  సామ రంగారెడ్డి విమర్శించారు. 

ఎంఐఎం ఓట్ల కోసం నిజాంను పొగడడం, తెలంగాణ విమోచనాన్ని సమైక్యతా దినోత్సవంగా పేరు మార్చడం ఉద్యమ వీరులను అవమానించడమేనని పేర్కొన్నారు. రజాకార్ల నిరంకుశ పాలనకు అద్దం పట్టేలా వ్యవహరిస్తూ సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు.  80వేల పుస్తకాలు చదివిన సీఎం కేసీఆర్ కు తెలంగాణలో నిజాం చేసిన అరాచకాల గురించి తెలియదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్లెం రవీందర్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.