యూఎస్ ఓపెన్ విజేతగా కార్లోస్ అల్కరాజ్

యూఎస్ ఓపెన్ విజేతగా  కార్లోస్ అల్కరాజ్

యూఎస్ ఓపెన్ 2022 విజేతగా కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. ఫైనల్లో 19 ఏళ్ల కార్లోస్..కాస్పర్ రూడ్ పై 6-4, 2-6, 7-6 (7-1), 6-3 స్కోరు తేడాతో విజయం సాధించాడు. దీంతో కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా ఈ విజయంతో నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. 

ఆరంభం నుంచే దూకుడు..
మెన్స్ సింగిల్స్ ఫైనల్లో..అల్కరాజ్..తొలి సెట్ను 6-4తో దక్కించుకున్నాడు. అయితే రెండో సెట్ లో రూట్ పుంజుకుని..4-2తో ఆధిక్యంలో నిలిచాడు. అదే జోరును మరో రెండు గేమ్స్ గెలిచి స్కోరు సమం చేశాడు. హోరా హోరీగా సాగిన మూడో సెట్ 6-6తో సమం అయింది. దీంతో టైబ్రేక్ కు వెళ్లింది. కీలక దశలో ఖతర్నాక్ షాట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించిన అల్కరాజ్..7-6తో మూడో సెట్ను దక్కించుకున్నాడు. నాల్గో సెట్లోనూ అల్కరాజ్..మరింత విజృంభించాడు. 6-3తో గెలిచి..ఫస్ట్ టైం యూఎస్ ఓపెన్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. 

అతిపిన్న వయసులో ..
యూఎస్ ఓపెన్ లో విజేతగా నిలిచిన  అల్కరాజ్ అతిపిన్న వయసులో గ్రాండ్ స్లామ్ నెగ్గిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల కిందట స్పెయిన్‌ బుల్ రఫెల్ నాదల్ 19 ఏళ్ల వయసులో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచాడు. కెరీర్‌లో 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన నాదల్.. 2005లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ నెగ్గాడు. అతిపిన్న వయసులో గ్రాండ్ స్లామ్ నెగ్గిన నాదల్ రికార్డును తాజాగా స్పెయిన్ కే చెందిన అల్కరాజ్ సమం చేయడం విశేషం.

కుర్రాళ్లకే టైటిల్..
యూఎస్ ఓపెన్లో వరుసగా మూడో ఏడాది కూడా కుర్రాళ్లే టైటిల్ను సాధించారు. 2021లో మెద్వెదేవ్ విజేతగా నిలవగా..2020లో డొమెనిక్ థీమ్ విన్నర్గా అవతరించాడు. తాజాగా 19 ఏళ్ల అల్కరాజ్ విజయం సాధించాడు. అటు సూపర్ ఫాంలో ఉన్న ఏడో ర్యాంకర్‌ రూడ్‌ ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్ చేరినా..నిరాశే ఎదురైంది. మరోసారి రన్నరప్తోనే సరిపెట్టుకున్నాడు. అతను ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ రన్నరప్‌గా నిలిచాడు.