డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం: గచ్చిబౌలి సీఐ

డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం: గచ్చిబౌలి సీఐ

గచ్చిబౌలి విప్రో సర్కిల్లో ప్రమాదానికి కారణం అయిన టిప్పర్ డ్రైవర్ బీహార్‭కు చెందిన వ్యక్తిగా గుర్తించామని గచ్చిబౌలి సీఐ సురేష్ తెలిపారు. నిర్లక్ష్యంగా వాహనం నడపడమే ప్రమాదానికి కారణమని చెప్పారు. అయితే.. బ్రేకులు ఫెయిల్ అయ్యాయా లేదా అన్నది తెలియాల్సి ఉందన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన డెలివరీ బాయ్ నసిర్ హుస్సేన్‭కు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారని సీఐ సురేష్ వెల్లడించారు. ఇక ప్రమాదంలో గాయపడ్డ అబ్దుల్ రజాక్ ఎమ్ జీఐటీలో థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు ఆయన తెలిపారు. సినిమా చూసి హాస్టల్‭కు వెళ్తున్న సమయంలో అబ్దుల్ రజాక్ ప్రమాదానికి గురైనట్లు చెప్పారు. ఇక అబ్దుల్ రజాక్‭తో పాటు బైక్ పై ఉన్న మరో యువకుడు సేఫ్‭గా ఉన్నట్లు తెలిపారు. 

ఇదే ప్రమాదంలో సుబెందు దాస్ అనే వ్యక్తి కూడా గాయపడ్డాడు.  అతడికి కాలు విరగడంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  నానక్ రామ్ గూడా‭లో ఉన్న ఫ్రెండ్ కోసం వెళ్తున్న సమయంలో సుబెందు దాస్ ప్రమాదానికి గురైనట్లు గచ్చిబౌలి సీఐ సురేష్ తెలిపారు. టిప్పర్ డ్రైవర్ పోలీసులు అదుపులోనే ఉన్నట్లు సీఐ సురేష్ వెల్లడించారు. గచ్చిబౌలి విప్రో సర్కిల్లో ఓ టిప్పర్ ఆగి ఉన్న 4 కార్లు, రెండు బైక్ లపైకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే..  ఘటనలో ఓ వ్యక్తి చనిపోగా... ఐదుగురికి గాయాలు అయ్యాయి.  వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.