అక్టోబర్ 4న తుది ఓటరు జాబితా.. రంగారెడ్డి కలెక్టర్ హరీశ్

అక్టోబర్ 4న తుది ఓటరు జాబితా.. రంగారెడ్డి కలెక్టర్ హరీశ్

రంగారెడ్డి, వెలుగు: స్వీప్ యాక్టివిటీ ద్వారా జనాలకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తామని, అక్టోబర్ 4న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. సోమవారం కొంగరకలాన్​లోని రంగారెడ్డి కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా రూపకల్పనపై ఆయన సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. పొరపాట్లకు తావు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలన్నారు.  క్షేత్రస్థాయిలో ఫారం 6,7,8 ద్వారా ఓటరు నమోదు,  కరెక్షన్స్ చేసుకోవచ్చన్నారు.  ఆగస్టు, 21న డ్రాఫ్ట్ రోల్ పబ్లికేషన్ ఉంటుందని, అక్టోబర్ 4న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తామన్నారు. 

 ఒకే ఇంట్లో 6 కంటే ఎక్కువ ఓట్లు ఉంటే సర్వే నిర్వహిస్తామని తెలిపారు. మరోవైపు   సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా వ్యాప్తంగా 343 అర్జీలు వచ్చాయని అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి తెలిపారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని ఆఫీసర్లను ఆదేశించారు.   సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్లు ప్రతిమా సింగ్  అధికారులు పాల్గొన్నారు.