ఇస్లామిక్ స్టేట్ చీఫ్ హతం

 ఇస్లామిక్ స్టేట్ చీఫ్ హతం
  • సిరియాలోని ఖురేషీ ఇంటిని చుట్టుముట్టిన అమెరికా బలగాలు
  • ఫ్యామిలీతోపాటు పేల్చేసుకున్న టెర్రరిస్ట్ లీడర్ 

అత్మె (సిరియా): ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) టెర్రరిస్ట్ సంస్థ చీఫ్ అబు ఇబ్రహీం అల్ హష్మీ అల్ ఖురేషీ ఖతమయ్యాడు. అమెరికా బలగాలు ఇంటిని చుట్టుముట్టడంతో తనను తాను పేల్చేసుకున్నాడు.ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టులు ఎక్కడున్నా పట్టుకుంటామని హెచ్చరించారు. 

బాగ్దాదీ మాదిరే చేసిండు

బుధవారం రాత్రి సిరియాలోని అత్మె టౌన్‌లో ఖురేషీ ఉంటున్న రెండు అంతస్తుల ఇంటిని అమెరికా స్పెషల్ ఫోర్సెస్ చుట్టుముట్టాయి. ‘‘ఖురేషీ.. పిల్లలతో సహా కుటుంబ సభ్యులను తన చుట్టూ ఉంచుకున్నాడు. ఈ విషయం తెలిసి.. ఖురేషీ టార్గెట్‌గా ఎయిర్‌‌ స్ట్రైక్స్ చేపట్టకూడదని నిర్ణయించాం. ఎయిర్‌‌ స్ట్రైక్స్ వల్ల పౌరులు కూడా చనిపోయే ప్రమాదం ఉందని మా స్పెషల్ ఫోర్సెస్ రెయిడ్స్‌ చేపట్టాయి” అని బైడెన్ వివరించారు. ‘‘తన కుటుంబం, బిల్డింగ్‌లోని వ్యక్తుల గురించి ఖురేషీ ఆలోచించలేదు. తనను తాను పేల్చేసుకున్నాడు. అచ్చం గత ఐఎస్ చీఫ్ చేసినట్లే” అని తెలిపారు. కాగా, ఈ ఆపరేషన్ ను వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తో కలిసి బైడెన్ స్వయంగా పర్యవేక్షించారు. 

మొత్తం 13 మంది మృతి

ఈ ఆపరేషన్‌లో కనీసం 13 మంది చనిపోయారని, ఇందులో నలుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారని ‘సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్’ సంస్థ చెప్పింది. పేలుడు దెబ్బకు పై అంతస్తులో ఒకపక్క మొత్తం కూలిపోయింది. ఇంటి గోడల నిండా, ఫ్లోర్‌‌పై ఎటు చూసినా రక్తపు మరకలే కన్పించాయి.

మోస్ట్ వాంటెడ్.. తలపై రూ.75 కోట్ల రివార్డు

ఖురేషీది ఇరాక్‌లోని తాల్ అఫర్‌ సిటీ. అమీర్ మొహమ్మద్ సైద్ అబ్ద్ అల్-రెహ్మాన్ అల్-మావ్లా అనే పేరు కూడా అతడికి ఉంది. 2019 అక్టోబర్‌‌లో ఇదే ఇడ్లిబ్ రీజియన్‌లో జరిగిన రెయిడ్‌లో బాగ్దాదీ హతమయ్యాడు. బాగ్దాదీ తర్వాత ఐఎస్ చీఫ్‌గా నియమితుడయ్యాడు. ప్రపంచ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లో ఒకడు. ఖురేషీ సమాచారం ఇచ్చేవాళ్లకు రూ.74.71 కోట్ల  రివార్డును అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. 

11 నెలల నుంచి ఉంటున్నడు

తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి సాధారణ జీవితాన్ని గడుపుతుండే వాడని ఇంటి యజమాని వివరించాడు. ‘‘అతడు (ఖురేషీ) 11 నెలల నుంచి ఉంటున్నాడు. నాకు ఏదీ అనుమానాస్పదంగా అనిపించలేదు. పెద్దగా గమనించేంతగా ఏమీ కనిపించలేదు” అని ఇంటి ఓనర్ అబు అహ్మద్ చెప్పాడు. ‘‘అతడు వచ్చి, రెంట్ ఇచ్చి వెళ్లేవాడు. భార్య, ముగ్గురు పిల్లలతో కలసి ఉంటున్నాడు. ఇంట్లో ఖురేషీ చెల్లెలు, ఆమె కూతురు కూడా ఉండేవాళ్లు” అని వెల్లడించాడు.