హోమ్ కేర్ సర్వీస్ కు మస్తు డిమాండ్

హోమ్ కేర్ సర్వీస్ కు మస్తు డిమాండ్

“ మాదాపూర్ లోని గేటెడ్ కమ్యూనిటికీ చెందిన వృద్ధ దంపతులు కరోనా బారినపడ్డారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో హాస్పిటల్​కు వెళ్లడం ఇబ్బందిగా మారింది. సీనియర్ సిటిజన్లకు వైద్య సేవలు అందించే ఓ ఏజెన్సీని ఫోన్ లో కాంటాక్ట్​ అవగా, నర్సింగ్ స్టాఫ్ ను పంపి వారికి వెంటనే కొవిడ్ ట్రీట్ మెంట్ స్టార్ట్​ చేశారు. హోం ఐసోలేషన్ లోనే వృద్ధ దంపతుల షుగర్, బీపీ, పల్స్, ఆక్సిజన్ లెవల్స్ ను ఎప్పటికప్పుడూ మానిటరింగ్ చేస్తూ ఆమె ట్రీట్​మెంట్​ చేయడంతో 15 రోజుల్లోనే వాళ్లకు క్యూర్ ​అయ్యింది. 
హైదరాబాద్, వెలుగు :సిటీలో కరోనాకు హోం ఐసోలేషన్ ట్రీట్​మెంట్​లోనే  వైద్య సేవలు అందించే ప్రొఫెషన్​కు మస్తు డిమాండ్ పెరిగింది. ఆస్పత్రుల్లో రద్దీ, ఫీజుల మోత వంటి కారణాలతో ఇంటి వద్దనే మెడికల్ సర్వీసెస్ కు చాలామంది ఇంట్రెస్ట్​  చూపిస్తుండడంతో కరోనా పేషెంట్లకు నర్సింగ్ స్టాఫ్​ భరోసానిస్తున్నారు. కొవిడ్ కంటే ముందు పేషెంట్లు, వృద్ధుల కోసం వెతికే ఏజెన్సీలు, ఇప్పుడు వస్తున్న కాల్స్ తో సేవలను విస్తరించుకుంటున్నాయి. కొవిడ్ తో హోం ఐసోలేషన్ లో ఉన్నవారికి వైద్య సేవలందించేందుకు ముందుకొస్తున్నాయి. ఎప్పటికప్పుడూ ఆరోగ్య పరిస్థితిని మానిటరింగ్ చేస్తూ  కోలుకునేంత వరకు పర్యవేక్షణ చేస్తున్నారు. కొంతకాలంగా వృద్ధులు, బెడ్ రిడిన్ పేషెంట్లకు ఇంటి వద్దనే వైద్య సేవలు సిటీలో  సాధారణంగా ఉన్నవే. కరోనా తర్వాత ఇంటి వద్దనే మెడికల్ సర్వీసులు అందించేందుకు ఏజెన్సీలు, స్టాఫ్ నర్సులకు డిమాండ్ పెరిగింది. కొవిడ్, పోస్టు కొవిడ్ పేషెంట్లకు అవసరాన్ని బట్టి మెడికల్ సేవలు అందిస్తున్నారు. హోం కేర్ సర్వీసెస్ అందించే ఏజెన్సీలు వందల్లో ఉన్నా.. కొవిడ్ కేర్ సర్వీసెస్ ఇచ్చే ఏజెన్సీలు, హాస్పిటళ్లు, స్టాఫ్ నర్స్ పరిమితంగానే ఉన్నారు. వారం,15 రోజుల ప్యాకేజీలతో కొవిడ్ ట్రీట్ మెంట్ ను అందిస్తున్నాయి.

ఇంటి వద్దనే సర్వీసెస్

కొవిడ్ పేషెంట్లకు సేవలు అందించడం ఇంటివారికి ఇబ్బందే. ఎన్ని జాగ్రత్తలు పాటించినా, నర్సింగ్ సిబ్బంది తరహాలో సేవలు చేయలేరు. ఈ క్రమంలో ఇంటి వద్దనే పేషెంట్​​కోలుకునేంత వరకు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకుని సేవలు పొందుతున్నారు. కొవిడ్ హోం కేర్ సర్వీసెస్ అందించేవి ప్రస్తుతం సిటీలో 70కి పైగా ఉండగా, మరో 20 ఆస్పత్రులు కూడా హోం కేర్ సర్వీసెస్ అందిస్తున్నాయి.

పోస్టు కొవిడ్ రోగులకు కూడా...

కరోనా వచ్చి తగ్గినా, వైరస్ ఎఫెక్ట్​ పూర్తిస్థాయిలో తగ్గకపోవడంతో కొందరికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం కామన్ గా మారింది. ఈ క్రమంలో వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షించడం  హెల్త్ సిబ్బంది తప్పనిసరి అయ్యింది. ఇక కొవిడ్ పేషెంట్లలో ప్రతి గంటకోసారి ఆక్సిజన్ లెవల్స్ మారుతుంటాయి. ఇలాంటి వారికి డాక్టర్లు సూచించే ఇంజక్షన్లు ఇచ్చేందుకు నర్సింగ్ స్టాఫ్ మస్ట్​. ఇలా అత్యవసర వైద్య సేవలు అందించేలా స్టాఫ్ కు శిక్షణ నిచ్చి ఇంటి వద్దనే వైద్య సేవలు అందిస్తున్నామని కూకట్ పల్లికి చెందిన హోం కేర్ సర్వీసెస్ నిర్వాహకుడు ప్రదీప్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం 25 మంది కరోనా పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

ట్రీట్​మెంట్​ ప్యాకేజీలుగా  

 వారం నుంచి 15 రోజుల వరకు హోం ఐసోలేషన్ పీరియడ్ ఉండగా, ప్యాకేజీలుగా వైద్య సేవలు అందిస్తారు. ఆక్సిజన్ సిలిండర్లు నుంచి రెమ్డిసివర్ ఇంజక్షన్ ఏర్పాటు చేసే హాస్పిటల్ నిర్వాహకులు ఉండగా, ఇవేవి లేకుండా కేవలం పర్యవేక్షణ సేవలు, వైద్య సేవలు అందించే ఏజెన్సీలు కూడా ఉన్నాయి. ప్యాకేజీ,  పేషెంట్​ఆరోగ్య పరిస్థితిని బట్టి చార్జీ చేస్తున్నారు. సిటీలో కొన్ని ఏజెన్సీలు రూ. 2500 నుంచి 5 వేల లోపు చార్జీ చేస్తున్నాయి. అదే ఆస్పత్రుల  నుంచే మెడికల్ సర్వీసెస్ పొందాలంటే 14  రోజులకు రూ. 15 వేల నుంచి 30 వేల వరకు చార్జీ చేస్తున్నాయి.

అందుబాటులో నర్సింగ్ స్టాఫ్

హోం కేర్ సర్వీసెస్ కు డిమాండ్ ఉండడంతో నర్సింగ్ స్టాఫ్ కూడా ముందుకొస్తున్నారు. ప్రస్తుతం హాస్పిటళ్లలో పనిచేస్తూ, ఉద్యోగాలు కోల్పోయిన వారు, నర్సింగ్ స్టూడెంట్లు కూడా సేవలు అందించేందుకు ముందుకొస్తున్నారు.  పేషెంట్లకు రోజువారీ పే​మెంట్ గా చార్జీ చేస్తున్నారు.  ఇంట్లో ఉంటూనే వైద్య సేవలు అందిస్తూ ఆదాయం పొందుతున్నారు. పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్కులు వినియోగిస్తూ ఇంట్లోనే హాస్పిటల్ తరహా ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. కరోనా రోగులకు పక్కన ఉండి వైద్య సేవలు అందితే మనో ధైర్యంతో కోలుకుంటారని ప్రైవేటు హాస్పిటల్ లో పనిచేసే నర్సింగ్ స్టాఫ్ రజనీ తెలిపారు. ‘‘మూడు నెలల్లో 18 మందికి హోం ఐసోలేనేషన్ లోనే ట్రీట్ మెంట్ అందించా... పేషెంట్​పక్కన ఉండి, వైద్యం అందిస్తూ వారితో ముచ్చటిస్తే  61 ఏళ్ల వృద్ధురాలు త్వరగా కోలుకుంది’’ అని ఆమె పేర్కొన్నారు. 

హోం ఐసోలేషన్​లోనే సేఫ్ గా ఉంటామని.. 

హోం కేర్ మెడికల్ సర్వీసెస్ ను గతేడాది  అందుబాటులోకి తెచ్చాం. మొదట్లో కరోనా పేషెంట్లను చూసుకునేందుకు వైద్య సిబ్బంది కూడా భయపడ్డారు. రెండు నెలలుగా కొవిడ్ హోం కేర్ సర్వీసెస్ చేసేందుకు స్టాఫ్ నర్స్ కు భారీగా డిమాండ్​ పెరిగింది. నర్సింగ్ స్టాఫ్ పర్యవేక్షణలో హోం ఐసోలేషన్ లో ఉండడం సేఫ్ గా ఉంటుందని ఫీలవుతు న్నారు. హాస్పిటళ్లకు వెళ్లి ఆందోళన చెందడం కంటే..  ఇంటి వద్దనే వైద్య సేవలు పొందేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అవసరాన్ని బట్టి టెలి మెడిసిన్ తో డాక్టర్లను సంప్రదిస్తూ, పేషెంట్​ఆరోగ్య పరిస్థితిని నర్సింగ్ స్టాఫ్ వివరిస్తారు. డిసెంబర్ కంటే ముందు ఇలాంటి డిమాండ్ లేదు. డయాబెటిక్, హార్ట్, బెడ్ రిడెన్ పేషెంట్లకు మాత్రమే హోం కేర్ సేవలు అందించేవాళ్లం. - రాజ్యలక్ష్మి, ఓంకార్ హోం కేర్ ఎండీ

మెడికల్  కేర్ మస్ట్​

కరోనా పేషెంట్​కు మెడికల్ కేర్ చాలా మస్ట్. లేదంటే భయాందోళన చెందే ప్రమాదం ఉంటుంది. అదే హెల్త్ స్టాఫ్ పర్యవేక్షణలో హోం ఐసోలేషన్ లో ఉన్నా పేషంట్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల అత్యవస ర వైద్య సేవలు వేగంగా అందించ డానికి వీలు ఉంటుంది. ఇక ఆక్సిజన్ వినియోగించే స్థితిలో ఉన్న పేషెంట్లకు అటెండెంట్​గా కుటుం బసభ్యులు ఎవరైనా ఉండాలి. 
- డాక్టర్​ తాజోద్దిన్