హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఈగల్ ఫోర్స్ విజయవంతంగా ఛేదించింది. అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని ఓ మామిడి తోటలో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న అక్రమ డ్రగ్ తయారీ యూనిట్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ మెరుపు దాడుల్లో రూ. 1 కోటి విలువైన డ్రగ్స్, రసాయనాలు, తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సుమారు 750 గ్రాముల నిషేధిత మెఫెడ్రోన్ డ్రగ్ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులను ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసింది.
ఒక మామిడి తోటలో రహస్యంగా షెడ్ ఏర్పాటు చేసి.. ‘ఫేషియల్ గ్లో పౌడర్’ (మొహానికి రాసుకునే పౌడర్) తయారు చేస్తున్నామంటూ నమ్మిస్తూ, లోపల ప్రాణాంతకమైన మెఫెడ్రోన్ డ్రగ్‌ను తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన డ్రగ్‌ను సూర్యాపేటకు తరలించి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా.. ఈగల్ ఫోర్స్ పక్కా ప్లాన్‌తో నిందితులను అడ్డంగా బుక్ చేసింది.
►ALSO READ | మీనాక్షి నటరాజన్‌పై అసలు కేసే లేదు..పవన్ ఎక్కడైనా పోటీ చేయొచ్చు: సీఎం రేవంత్
ఈ రాకెట్లో పట్టుబడిన ప్రధాన నిందితుడు కీసరి మత్స్యగిరికి దశాబ్ద కాలానికి పైగా నేర చరిత్ర ఉన్నట్లు ఈగల్ ఫోర్స్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా డ్రగ్స్ తయారీ, దోపిడీలు, చివరకు హత్య కేసుల్లో కూడా ఇతనికి ప్రమేయం ఉంది. గతంలో.. అంటే 2022లో డీఆర్ఐ (DRI) జరిపిన దాడుల్లో ఏకంగా 136 కిలోల మెఫెడ్రోన్ దొరికిన కేసులోనూ ఈ మత్స్యగిరి ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చినా ఇతని బుద్ధి మారలేదు.
ప్రస్తుతం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ కేసుతో సంబంధం ఉండి పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
